ఏఐఏడీఎంకే .. తమిళనాట దివంగత సీఎం ఎంజీ రామచంద్రన్ పురుడు పోసిన పార్టీ. మరో దివంగత సీఎం జయలలిత సారథ్యంలో దేశ రాజకీయాలను శాసించింది. ఎంతో ఘనత ఉండి.. ద్రవిడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన అన్నాడీఎంకే ప్రస్తుతం నాయకత్వ లేమిని ఎదుర్కొంటోంది. క్షేత్రస్థాయి నుంచి నాయకత్వ స్థాయి వరకు ఐకమత్యం కొరవడిందనే ప్రచారం జరుగుతోంది.
మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించేంత వరకు ఎంతో బలంగా ఉన్న ఆ పార్టీలో.. తదనంతరం చీలికలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏఐఏడీఎంకే(అన్నాడీఎంకే) కార్యకర్తలు.. ఓ శక్తిమంతమైన నాయకుడి కోసం వెతుకుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో.. జయలలిత నెచ్చెలి, ఏఐఏడీఎంకే బహిష్కృత నేత శశికళ వైపు వారు మళ్లీ మొగ్గు చూపే అవకాశాలూ లేకపోలేదని భావిస్తున్నారు.
![sasikala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20210209-wa0008_1002newsroom_1612925967_212.jpg)
పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పేరుతో..
అక్రమాస్తుల కేసులో బెంగళూరు జైలులో శిక్ష అనుభవించిన ఏఐఏడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ.. చెన్నైకు చేరుకున్నారు. ఆమె 23 గంటల ప్రయాణ మార్గంలో అభిమానులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఇందులో ఏఐఏడీఎంకే పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. దీన్ని ఆ పార్టీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఈ క్రమంలో ర్యాలీలో పాల్గొన్నట్లుగా భావిస్తున్న ఏడుగురు నాయకులపై అన్నాడీఎంకే వేటు వేసింది. శశికళను స్వాగతిస్తూ.. బ్యానర్లు కట్టిన, పోస్టర్లు అతికించిన ఆఫీసు బేరర్లను కూడా తొలగించింది. ఈ చర్యలను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలుగా పేర్కొంటూ.. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి వారిని తొలగించింది.
![sasikala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20210209-wa0009_1002newsroom_1612925967_769.jpg)
సత్తా చాటేందుకేనా?
బెంగళూరు నుంచి చెన్నైకి చేరుకోవడానికి విమానంలో ప్రయాణించవచ్చు. కానీ, శశికళ మాత్రం రోడ్డు మార్గాన్నే ఎంచుకున్నారు. 23 గంటల పాటు ఆమె కారులో ప్రయాణించి చెన్నైకి చేరుకున్నారు. అధికార ఏఐఏడీఎంకేకు తన రాజకీయ శక్తిని చాటేందుకే.. ఆమె ఇలా రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది.
![sasikala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/img-20210209-wa0003_1002newsroom_1612925967_15.jpg)
శశికళ మేనల్లుడు టీటీవీ దినకరణ్‌కు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) నేతలు సహా ఏఐఏడీఎంకే పార్టీ నేతలు.. శశికళ 360 కి.మీల ప్రయాణంలో అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు.
ప్రక్షాళన పర్వం..
ఇటీవల కరోనా బారిన పడిన శశికళ.. చికిత్స అనంతరం బెంగళూరులోని రిసార్టులో విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో శశికళను పరామర్శించేందుకు ఏఐఏడీఎంకే కార్యదర్శి యువరాజ్ ప్రయత్నించారు. దీనిపై ఆగ్రహించిన ఆ పార్టీ అధినాయకత్వం.. యువరాజ్‌ను ఆ హోదా నుంచి తొలగించింది.
బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు శశికళ తన కారుపై అన్నాడీఎంకే జెండాతో ప్రయాణించడం పట్ల ఆ పార్టీ మంత్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వగా.. పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో కృష్ణగిరి తూర్పు జిల్లా యూనియన్ కార్యదర్శి సంబాంగి.. తన కారును శశికళకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. సంబాంగిపై ఏఐఏడీఎంకే వేటు వేసింది. ఇదే తరహాలో మరో ఐదుగురిని పార్టీ నుంచి తప్పించింది నాయకత్వం.
![sasikala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10561118_p_1002newsroom_1612925967_930.jpg)
ఉమ్మడి శత్రువుపై పోరాడాలి..
బెంగళూరులో సోమవారం ఉదయం ఏడున్నర గంటలకు ప్రారంభమైన శశికళ ప్రయాణం.. మంగళవారం ఉదయానికి టీనగర్లో తన నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వందలాది మంది ఏఐఏడీఎంకే నేతలు.. శశికళ వెంట నడిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఏఎంఎంకే ప్రతినిధి సీఆర్ సరస్వతి పేర్కొన్నారు. పార్టీ నుంచి వారందరినీ తొలగిస్తే.. ఇక ఎవరి కోసం ఏఐఏడీఎంకేను నడుపుతారని ప్రశ్నించారు. ఉమ్మడి శత్రువైన డీఎంకేకు వ్యతిరేకంగా తామంతా పోరాడాలని ఆమె హితవు పలికారు. జయలలిత వారసురాలి నాయకత్వంలో అంతా కలిసి ఉండాలని కోరారు.
ఇది సరైన చర్యేనా..
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై తాము చర్యలు తీసుకుంటామని ఏఐఏడీఎంకే నేత వైగైసెల్వన్ స్పష్టం చేశారు. జయలలిత మరణానంతరం.. మొదట్లో తాము శశికళను అంగీకరించామని చెప్పారు. కానీ, ఇప్పుడు ప్రజలు ఆమెను తిరస్కరిస్తున్నారని అన్నారు. మరి అలాంటప్పుడు పార్టీ కార్యకర్తలు శశికళకు మద్దతు తెలపడం న్యాయమేనా? అని ఆయన ప్రశ్నించారు.
అది ఆమె బలం..
శశికళకు అందిన ఘన స్వాగతంపై సీనియర్ పాత్రికేయుడు ఆర్.రాధాకృష్ణన్ స్పందించారు. శశికళ కోసం కార్యకర్తలు గంటల తరబడి ఎదురుచూస్తారన్న ఆయన.. అది ఆమె బలం అని పేర్కొన్నారు. శశికళకు కార్యకర్తల నుంచి బలమైన మద్దతు ఉందని చెప్పారు. ఇదే ప్రయాణాన్ని ఆమె.. రాష్ట్రమంతటా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
![sasikala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10561118-thumbnail-3x2-sasikala_1002newsroom_1612925967_648.jpg)
విశ్లేషకుల మాట ఇది..
అన్నాడీఎంకే కార్యకర్తలు.. ఓ శక్తిమంతమైన నాయకుడి కోసం వెతుకుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న కారణంతో మరెందరో కార్యకర్తలపై ఆ పార్టీ వేటు వేస్తుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏఐఏడీఎంకేలో ఈ మార్పులు రాబోయే రోజుల్లో ముఖ్య భూమిక పోషిస్తాయని అంటున్నారు. అన్నాడీఎంకేలో 'కీలక హోదా' అధిరోహించేంత వరకు ఆమె విశ్రమించరని శశికళ సన్నిహితులు సైతం చెబుతున్నారు.
ఇవీ చదవండి: