అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ ఈ నెల 8వ తేదీన తమిళనాడుకు రానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా హింసకు తెర తీసేందుకు శశికళ మద్దతుదారులు కుట్రలు చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికార అన్నాడీఎంకే పార్టీ నేతలు.
దీనిపై శశికళ మేనల్లుడు దినకరన్ స్పందించారు. అన్నాడీఎంకే నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. తమను అపకీర్తిపాలు చేసేందుకు కుట్ర పన్ని అసత్యాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
కొద్ది రోజుల క్రితం అనారోగ్యం కారణంగా బెంగళూరులోని ఆసుపత్రిలో చేరిన శశికళ ఇటీవలే కోలుకున్నారు. అవినీతి కేసులో ఆమెకు విధించిన నాలుగేళ్ల జైలు శిక్ష జనవరి 27తో పూర్తయింది. సోమవారం కర్ణాటక నుంచి తమిళనాడుకు తిరిగి రానున్నారు. ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకే నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆ పార్టీ ముఖ్యనేతలతో తమిళనాడు సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పనీర్ సెల్వం సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి అమలు చేయాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీలో శశికళ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయంపై మాట్లాడేందుకు నాయకులు నిరాకరించారు.
"తమిళనాడులో హింసను సృష్టించడానికి శశికళ, దినకరన్‌లు కుట్రలు చేస్తున్నారు. దినకరన్ అన్నాడీఎంకే పార్టీ జెండాతో హింసను ప్రేరేపించాలి అని అనుకుంటున్నారు. ఇప్పటికే ఆయన మద్దతుదారులు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి పోలీసులకు ఫిర్యాదు చేశాం. శాంతి భద్రతలు కాపాడాలని కోరాం."
-సీవీ షణ్ముగం, తమిళనాడు న్యాయశాఖ మంత్రి
ఇదీ చూడండి: చిన్నమ్మ దారెటు? పార్టీపై పెత్తనం సాధ్యమా?