డీఎంకే 6... అన్నాడీఎంకే 4...
తమిళనాడులో 39 లోక్‌సభ నియోజకవర్గాలు. ఏప్రిల్ 19న పోలింగ్. సీట్ల సర్దుబాటు తర్వాత అన్నాడీఎంకే 20, డీఎంకేకు 20 సీట్లు మాత్రమే మిగిలాయి. అన్నాడీఎంకే 4 సీట్లు ప్రముఖ నేతల కుమారులకే కేటాయించింది. వారిలో ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కుమారుడు ఒకరు. ప్రతిపక్ష డీఎంకే 6 సీట్లు వారసులకే ఇచ్చింది.
పన్నీర్ సెల్వం కుమారుడికి టికెట్
మంత్రి డి.జయకుమార్ కుమారుడు, సిట్టింగ్ ఎంపీ జయవర్ధన్‌కు మరోమారు దక్షిణ చెన్నై స్థానం నుంచి అవకాశం కల్పించింది అన్నాడీఎంకే. తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్ వారసుడు మనోజ్ పాండియన్‌కు సీటు ఖరారు చేసింది. టికెట్ లభించిన మరో ఇద్దరు వారసుల నేతలు పన్నీర్ సెల్వం కుమారుడు రవీంద్రనాథ్ కుమార్, వీవీ రాజన్ వారసుడు వీవీఆర్ రాజ్సత్యన్.
"జయవర్ధన్, మనోజ్ పాండియన్‌ను జయలలిత ఉన్నప్పుడు లోక్‌సభ, రాజ్యసభలకు నామినేట్ చేశారు. పార్టీలో రాజకీయ వారసత్వం అనేదే లేదు. విశ్వసనీయత, కష్టపడే తత్వాన్ని బట్టే అభ్యర్థులను ఎంపిక చేశాం."
-ఆర్ఎం బాబు మురుగవేల్, అన్నాడీఎంకే అధికారిక ప్రతినిధి
డీఎంకేలో కరుణానిధి మరణానంతరం వారసత్వపోరు తీవ్రమైంది. కరుణ కుమారుడు ఎంకే స్టాలిన్ ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. మరో కుమారుడు అళగిరిని డీఎంకే 2014లో సస్పెండ్ చేసింది. కుమార్తె కనిమొళి 2007 నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. జులైలో ఆమె పదవీకాలం ముగుస్తుంది. ఈ ఎన్నికల్లో ట్యూటికొరిన్ నుంచి పోటీ చేస్తున్నారు కనిమొళి. కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ సెంట్రల్ చెన్నై నుంచి పోటీ చేస్తున్నారు.
డీఎంకే నేత టీఆర్ బాలు కుమారుడు టీఆర్బీ రాజాకు టికెట్ ఇచ్చింది డీఎంకే అధిష్ఠానం. ఐ. పెరియసామి కుమారుడు ఐపీ సెంథిల్ కుమార్‌కూ టికెట్ ఇచ్చారు. ఈ ఇద్దరు యువ నేతలు ప్రస్తుతం శాసన సభ్యులు.
"పార్టీ కోసం చాలా కాలంగా పనిచేస్తున్నవారికే టికెట్లు ఇచ్చాం. బయటి నుంచి వచ్చిన ఏ వ్యక్తినీ ఎంపిక చేయలేదు."
-కనిమొళి, డీఎంకే నాయకురాలు
ఇవీ చూడండి:యూపీలో భాజపా 'రాజకీయ ఇంజినీరింగ్'