ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆపరేటర్ అహ్మదాబాద్- ముంబయి మార్గంలో తేజస్ రైలు పట్టాలెక్కనుంది. ఇప్పటికే దేశంలో తొలి ప్రైవేటు రైలుగా లఖ్‌నవూ-దిల్లీ మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ విజయవంతమైన క్రమంలో.. ఈ ట్రైన్‌ను తీసుకొస్తున్నారు.
ఈ రైలును.. రైల్వే మంత్రి పీయూష్ గోయల్, గుజరాత్ సీఎం విజయ్ రూపానీలు ఇవాళ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. వాణిజ్య రాకపోకలు ఈనెల 19 నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. వారానికి ఆరు రోజులు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. అత్యాధునిక సౌకర్యాలతో పూర్తి ఏసీ ట్రైన్‌గా తేజస్ ముందుకొచ్చింది. ఈ రైలులో ఒక్కోటి 56 సీట్ల సామర్థ్యం కలిగిన రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్‌కార్స్‌తో పాటు 8 చైర్ కార్స్‌తో మొత్తం 736 మంది ప్రయాణికులు తమ గమ్యస్ధానాలకు చేరుకోవచ్చు.
ట్రైన్ బుకింగ్ సేవలను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్ రైల్‌కనెక్ట్ ద్వారా ప్రయాణికులు తమ టికెట్లను నమోదు చేసుకోవచ్చు.
ఇదీ చూడండి: ప్రైవేటు రంగం చేతుల్లోకి తేజస్ రైలు