మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే... ఐఎల్ అండ్ ఎఫ్‌సీ అక్రమ నగదు చలామణి కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో దక్షిణ ముంబయిలోని ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు.
మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు ఈడీ కార్యాలయం వద్ద గుమిగూడకుండా, ఎలాంటి అల్లర్లు జరుగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మధ్య ముంబైలోని దాదర్ ప్రాంతంలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా పలువురు ఎమ్ఎన్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
అభిమానులారా రావొద్దు...
ఈడీ కార్యాలయం వద్దకు తన అభిమానులు ఎవరూ రావొద్దని రాజ్‌ఠాక్రే విజ్ఞప్తి చేశారు.
ఇదీ కేసు
దాదర్ ప్రాంతంలో కోహినూర్ స్క్వేర్ టవర్ అభివృద్ధి సంస్థకు సంబంధించి, 450 కోట్ల అక్రమ నగదు చలామణి జరిగిందని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసు విషయమై విచారణకు హాజరుకావాలని ఈడీ రాజ్‌ఠాక్రేకు నోటీసులు ఇచ్చింది. ఇదే కేసులో మాజీ ముఖ్యమంత్రి, శివసేన సీనియర్ నేత మనోహర్ జోషి కుమారుడు ఉమేశ్ జోషికి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.
ఇదీ చూడండి: 'పాక్‌కు భారత జలాల నిలిపివేత ప్రక్రియ ప్రారంభం'