మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి నిర్ణయంలోనే తన మార్క్‌ను చూపించారు ఉద్ధవ్ ఠాక్రే. గత నెలలో దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారిన ఆరె కాలనీలో మెట్రో కార్‌షెడ్ నిర్మాణ పనులపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. ముంబయి మెట్రో రైల్ ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయట్లేదని స్పష్టం చేశారు.
" ఆరె కాలనీలో కార్‌షెడ్ నిర్మాణంపై స్టే విధిస్తున్నా. పూర్తి ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తాను. రాత్రిపూట చెట్లను నరికివేసే సంప్రదాయాన్ని అనుమతించబోను. తదుపరి ఆదేశాలు అందే వరకు కనీసం ఒక చెట్టు కొమ్మ కూడా నరకడానికి వీలులేదు. అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యా. బాధ్యతల నుంచి దూరంగా పారిపోను."
- ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి
ఫడణవీస్‌పై విమర్శలు...
శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మరోమారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తానని ఫడణవీస్ ప్రకటించటంపై విమర్శలు చేశారు ఉద్ధవ్ ఠాక్రే. నేను ముఖ్యమంత్రిని అవుతానని ఎప్పుడూ ప్రకటించలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ముంబయిలో జన్మించిన తొలి ముఖ్యమంత్రినని.. నగర అభివృద్ధికి ఎళ్లవేళల కృషి చేస్తానని పేర్కొన్నారు ఠాక్రే. కాషాయ రంగు కుర్తా ధరించటంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. తనకు ఇష్టమైన రంగని, అది ఎక్కడ ఉతికినా రంగు పోదని తెలిపారు.
ఇదీ చూడండి: గుర్రం పేడలో బంగారం స్మగ్లింగ్.. పట్టేసిన పోలీసులు!