బిహార్ దర్భంగ జిల్లాకు చెందిన సతీష్ 2008లో వైద్యం చేయించుకునేందుకు రాజధాని పట్నాకు వెళ్లాడు. కానీ, ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు అతని కోసం గాలించారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. ఏళ్లు గడిచినా సతీష్ ఆచూకీ దొరకలేదు.
2012లో అతని బంధువు ఒకరికి సతీష్ బంగ్లాదేశ్ జైల్లో ఉన్నాడన్న విషయం తెలిసింది. కుటుంబసభ్యులు తనను ఇంటికి రప్పించేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టారు. ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అయినా ఫలితం దక్కలేదు. ఎట్టకేలకు సామాజికవేత్త విశాల్ రంజన్ ధాతువార్ సహకారంతో భారత్‌కు చేరుకున్నాడు.
"జులైలో నాకు ఓ నివేదిక ఇచ్చారు. సతీష్ విషయంపై నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు లేఖ రాశాను. భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ పంపాను. ప్రధాని మోదీకి లేఖ రాశాను. ఆయన విదేశాంగ శాఖకు ఆదేశాలిచ్చారు. జైశంకర్‌కు లేఖ రాశాను. ఆయన బంగ్లాదేశ్‌లోని రాయబారులకు సతీష్ వ్యవహారం అప్పగించారు. ఆగస్టు 4న నాకు బంగ్లాదేశ్ నుంచి ఫోన్, ఈమెయిల్ వచ్చింది. "
-విశాల్ రంజన్ ధాతువార్, సామాజికవేత్త
శుక్రవారం సాయంత్రం సతీష్ పట్నాకు చేరుకున్నాడు. అక్కడి నుంచి దర్భంగాకు చేరాడు. గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఇన్నేళ్లు పరాయి దేశంలో జీవచ్ఛవంలా కాలం గడిపిన సతీష్ పునర్జన్మ పొందినట్టుగా ఆనందంతో తల్లిని చేరాడు.
కానీ, మానసికంగా కాస్త దెబ్బతిన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు సతీష్. బంగ్లాదేశ్‌కు ఎలా వెళ్లావు అని అడిగితే నాకేమీ గుర్తులేదని చెబుతున్నాడు.
ఇదీ చూడండి:పెద్ద పులుల పండుగ.. సాగిందిలా సంబరంగా!