మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'వందేభారత్ ఎక్స్‌ప్రెస్' ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తక్కువ ధరకే విమాన తరహా అత్యాధునిక సౌకర్యాలు అందిస్తోంది.
విలాసవంతమైన సీట్లు, సౌకర్యవంతమైన ప్రయాణం అయినందున వందేభారత్‌లో ప్రయాణించేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహం చూపుతున్నారు. ఈ ఏడాది జనవరి 27న ఈ ట్రైన్‌కు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేశారు. దీన్నే ట్రైన్ 18 అని కూడా పిలుస్తారు. 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) ఈ సెమీ హై స్పీడ్ రైలును నిర్మించింది.
ఈ ఏడాదే సేవలు..
దిల్లీ - వారణాసి (758 కిలోమీటర్లు) మధ్య నడిచే వందేభారత్ రైలును ఈ ఏడాది ఫిబ్రవరి 15న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. అయితే రెండు రోజుల అనంతరం ఫిబ్రవరి 17న తొలిసారి సేవలు ప్రారంభమయ్యాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. కాన్పూర్, అలహాబాద్ మీదుగా గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. గంటకు 180 కిలోమీటర్లు ఈ రైలు గరిష్ఠ వేగం. దాదాపు 377 మీటర్లు పొడవున్న వందేభారత్‌లో మొత్తం 16 బోగీలుంటాయి. ఒకేసారి 1,128 మంది దాకా ప్రయాణించొచ్చు. ఇందులో రెండు ఏసీ బోగీలు కూడా ఉంటాయి. ప్రయాణ సౌలభ్యం కోసం రైలుకు ఇరువైపులా డ్రైవర్ కోచ్‌లుంటాయి.
ఈ ఏడాదిలోనే 'దిల్లీ - వైష్ణోదేవీ కాట్రా' మధ్య మరో రైలును ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.