2014తో పోల్చితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో నేరచరిత్ర ఉన్న అభ్యర్థులు పెరిగారని వెల్లడించింది అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్-ఏడీఆర్. లోక్సభ బరిలో నిలిచిన 7,928 మంది అభ్యర్థుల్లో 15 వందల మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ లెక్కన పోటీ చేసిన ప్రతి ఐదుగురిలో ఒక్కరు తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారని విశ్లేషించింది.
మొత్తం 8,049 మంది అభ్యర్థుల్లో 7, 928 మంది ఎన్నికల అఫిఢవిట్లను విశ్లేషించింది ఏడీఆర్. అందులో 19 శాతం మంది నేరచరితులను స్పష్టం చేసింది.
2014 ఎన్నికల్లో పోటీ చేసిన 8,205 అభ్యర్థుల్లో 1,404 మంది(17శాతం)... 2009 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 7,810 మందిలో 1158 మంది అభ్యర్థులు (15శాతం) నేరచరితులని గుర్తుచేసింది ఏడీఆర్.
పార్టీలవారీగా నేరచరితుల సంఖ్య:
పార్టీ | మొత్తం అభ్యర్థులు | నేర చరితుల సంఖ్య | శాతం |
---|---|---|---|
భాజపా | 433 | 175 | 40% |
కాంగ్రెస్ | 419 | 164 | 39% |
బీఎస్పీ | 69 | 40 | 58% |
పార్టీలవారీగా కోటీశ్వరుల వివరాలను సంస్థ విడుదల చేసింది. ఈ దఫా ఎన్నికల్లో పాటలీపుత్ర నుంచి పోటీ చేసిన రాజేశ్ కుమార్ శర్మను అత్యంత సంపన్నుడిగా పేర్కొంది. రాజేశ్ తన అఫిడవిట్లో రూ. 1107 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. సరాసరిగా చూస్తే ఒక్కో అభ్యర్థి 4.14 కోట్లు కలిగి ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది.
పార్టీలవారీగా కోటీశ్వరుల సంఖ్య:
పార్టీ | కోటీశ్వరులు | అభ్యర్థుల్లో శాతం |
భాజపా | 361 | 83% |
కాంగ్రెస్ | 348 | 83% |
బీఎస్పీ | 127 | 33% |
సీపీఎం | 25 | 36% |
ఎన్సీపీ | 20 | 59% |
ఇతరులు | 506 | - |
ఎన్నికల్లో పోటీ చేసే మహిళల సంఖ్య పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సంస్థ వ్యవస్థాపక సభ్యుడు ప్రొఫెసర్ జగ్దీప్ చోక్కర్.
" లోక్సభ బరిలో మహిళా అభ్యర్థులు 2009లో 7 శాతం ఉన్నారు. 2014లో 8 శాతం పోటీలో నిలిచారు. 2019లో గమనిస్తే 9 శాతం. ఇలా ఒక్కో శాతం పెరుగుకుంటూ పోతే 50శాతం అయ్యేందుకు 3వేల సంవత్సరాలు పడుతుందేమో."
-ప్రొఫెసర్ జగ్దీప్ చోక్కర్, వ్యవస్థాపక సభ్యుడు-ఏడీఆర్
ఇదీ చూడండి: 'మోదీ... వానొస్తే విమానాలు మాయం అవుతాయా?'