దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. తిరిగి స్వస్థలాలకు పయనమవుతున్నారు. దిల్లీ నుంచి వందలమంది వలస కూలీలు ఉత్తర్‌ప్రదేశ్ వైపు కాలినడకన తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని గమనించిన ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం.. చర్యలకు పూనుకుంది. కూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులు నడుపేందుకు ముందుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న వలస కార్మికులు దిల్లీలోని ఆనంద్ విహార్ బస్టాండ్ ప్రాంగణానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫలితంగా బస్టాండ్ ప్రాంగణం మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది.
క్వారంటైన్లో లక్ష మంది
వివిధ రాష్ట్రాల నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వచ్చిన దాదాపు లక్ష మందికి పైగా ప్రజలను క్వారంటైన్లో ఉంచాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. గత మూడు రోజులుగా రాష్ట్రానికి వచ్చిన వారందరి పేర్లు, వివరాలు జిల్లా మేజిస్ట్రేట్ వద్ద అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
ఈ మేరకు సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి యోగి.. నిత్యవసరాల సరఫరాకు ఆటకం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. వలస వచ్చిన వారందరికీ ఆహారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. లాక్డౌన్ సమయంలో ఎవరూ ఆకలితో ఉండకూడదని స్పష్టం చేశారు.
లాక్‌డౌన్‌ను పాటించి ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని అభ్యర్థించారు యోగి. కరోనాపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన దేశాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని అన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ ప్రజల సహాయార్థం 12 రాష్ట్రాల్లో నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు.
హెల్ప్‌లైన్ ఏర్పాటు
కరోనా లక్షణాలు కనిపిస్తే సీఎం హెల్ప్‌లైన్ నంబర్ 1076కు కాల్ చేయాలని యూపీ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ తెలిపారు. నంబర్‌కు కాల్ చేసి వైద్య సలహాలు పొందవచ్చని స్పష్టం చేశారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన 60 వేల మంది ప్రజలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: దేశంలో కరోనా కలకలం-ఒక్కరోజులో 179 కేసులు