గుజరాత్లో బంగాళాదుంప సాగు చేసిన రైతులపై పెట్టిన కేసులను ఆహార, శీతల పానీయాల దిగ్గజ సంస్థ పెప్సికో ఇండియా బేషరతుగా ఉపసంహరించుకుని... కేసులు పెట్టి రైతులను వేధించినందుకు పరిహారం చెల్లించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.
"రైతులపై పెప్సికో పెట్టిన కేసులు బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులపై కేసులు పెట్టి వేధించినందుకు కంపెనీ పరిహారాన్నీ చెల్లించాలి. చట్టంలో చాలా స్పష్టంగా ఉంది... విత్తన ఉత్పత్తిదారుల హక్కుల కంటే రైతు హక్కులు ఎప్పుడూ అధిగమించే ఉంటాయని. విత్తనాలపై రైతు హక్కుల విషయంలో చర్చలు అనవసరం."-కపిల్ షా, జతన్ ఎన్జీవో సంస్థ
రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటామని పెప్సికో ప్రకటించిన మరుసటి రోజే రైతు సంఘాలు ఈ డిమాండ్ చేశాయి.
ఇంతకు ముందు పెప్సికో తాను మేథోహక్కులు (ప్లాంట్ వెరైటీ ప్రొటెక్షన్) పొందిన ఓ బంగాళాదుంప రకాన్ని ..అనుమతి లేకుండా సాగుచేస్తున్నారంటూ కొంతమంది రైతులపై కేసులు నమోదుచేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఫలితంగా రైతు హక్కుల సంరక్షణ కోసం సుమారు 25 జాతీయ, రాష్ట్ర స్థాయి రైతు సంఘాలు నడుంబిగించాయి. ఇందు కోసం భారతీయ కిసాన్ సంఘ్, గుజరాత్ కర్షక సంఘాలు, పలు ఎన్జీవో సంస్థలు కలిసి ఓ కేంద్ర 'సీడ్ సావర్నిటీ ఫోరం' ఏర్పాటుచేయాలని నిర్ణయించాయి. ఇందు కోసం శుక్రవారం గుజరాత్ విద్యాపీఠ్‌లో ఓ సదస్సు నిర్వహించాయి.
చట్టాలు మాతృభాషలో ఉండాలి...
రైతు సంక్షేమ చట్టాలు ముఖ్యంగా ఆంగ్లభాషలో ఉండడం వల్ల రైతులకు వాటిపై అవగాహన ఉండడం లేదని గుజరాత్ విద్యాపీఠ్ రిజిస్ట్రార్ రాజేంద్ర కిమానీ ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరమే ఈ సమస్యను అధిగమించాలని అభిప్రాయపడ్డారు.
"అన్ని చట్టాలు ఆంగ్లం భాషలో ఉన్నాయి. ఎక్కువ మంది రైతులు అర్థం చేసుకునే భాషల్లో ఈ చట్టాలు లేవు. అందువల్ల రైతులకు తమ హక్కుల గురించి అవగాహన లేకుండా పోతోంది. ఆ చట్టాలను స్థానిక భాషల్లో అందుబాటులో ఉంచాలి. రైతు సంక్షేమ చట్టాలను నీరుగార్చే ప్రయత్నాలు అడ్డుకోవాల్సిన అవసరముంది"- రాజేంద్ర కిమానీ, గుజరాత్ విద్యాపీఠ్ రిజిస్ట్రార్
ఇదీ చూడండి: 'కాంగ్రెస్‌లో చేరినా... ఆర్ఎస్ఎస్ను వీడలేదు'