ఉగ్రవాదానికి మద్దతిస్తున్నవారిపై తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఐరోపా సమాఖ్య ఎంపీలతో జరిగిన సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ... ఉగ్రవాదానికి సహకరిస్తున్నవారిని ఉపేక్షించకూడదని తెలిపారు.
"మానవజాతికి అతిపెద్ద ముప్పు ఉగ్రవాదం. దానికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రపంచ దేశాలు కలిసి రావాలి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నవారిపై, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం అందిస్తున్నవారిపై కఠిన చర్యలు చేపట్టాలి. ఉగ్రకార్యకలాపాలకు మద్దతిస్తున్నవారిని, ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా పాటిస్తున్నవారిపై చర్యలు తీసుకోవడం అవసరం. ఉగ్రవాదంపై పారదర్శక పోరు చేయాలి."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
'కశ్మీర్ పర్యటన మంచిదే...'
రేపు ఐరోపా ఎంపీలు జమ్ముకశ్మీర్‌లో పర్యటించనున్నారు. వారి పర్యటన మంచి ఫలితాల్నివ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు మోదీ. జమ్మూ, కశ్మీర్, లద్దాఖ్ సంప్రదాయాలు, ప్రాంతీయ వైవిధ్యాలను అర్థం చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశమన్నారు. కశ్మీర్ అభివృద్ధి, పరిపాలనలో ప్రభుత్వ ప్రాధాన్యాలపై అవగాహన పొందడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని తెలిపారు.
సులభతర వాణిజ్య విధాన ర్యాంకింగ్స్‌లో భారత్ ప్రదర్శన, స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ పథకాలను ప్రస్తావించారు మోదీ.