రాజస్థాన్‌లో కాంగ్రెస్ సర్కారును కూల్చివేయడానికి శాసనసభ్యులను ప్రలోభపెట్టే సంభాషణలుగా చెబుతున్న ఆడియో టేపులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శనివారం కేసు నమోదు చేసింది. శుక్రవారం వెలుగులోకి వచ్చిన టేపులపై వెంటనే పోలీసు కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఏసీబీ రంగంలోకి దిగింది. కాంగ్రెస్ చీఫ్ విప్ మహేశ్ జోషి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ అలోక్ త్రిపాఠి తెలిపారు. భాజపా నేత సంజయ్‌జైన్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌లతో తిరుగుబాటు శాసనసభ్యుడు భన్వర్‌లాల్ శర్మ జరిపినట్లు చెబుతున్న సంభాషణ వివరాలను ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచారు. ఈ టేపులను ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించనున్నారు. మరోవైపు.. సంజయ్‌జైన్‌కు తమ పార్టీతోనే సంబంధం లేదని భాజపా తోసిపుచ్చింది. జైన్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా మరో బృందం జైపుర్‌నుంచి మనేసార్‌కు వెళ్లింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ సర్కారు.. రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతుల్లో రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేసిందా అని భాజపా ప్రశ్నించింది. ఈ అంశంతో పాటు, అక్రమాల పరంపర, అబద్ధాలకోరు వ్యవహారాలపై సీబీఐ విచారణ జరిపించాలని పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా దిల్లీలో విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఆడియో టేపులు నిజమైనవేనని పోలీసులు తేల్చడానికంటే ముందే రాజస్థాన్ ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నేతలంతా దానిని ధ్రువీకరిస్తున్నారని ఆయన విమర్శించారు. రాజస్థాన్‌లో జరుగుతున్నది పూర్తిగా కాంగ్రెస్ కుమ్ములాటల వ్యవహారమేనని చెప్పారు. టేపులపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేయడమంటే భాజపా తన తప్పును అంగీకరించినట్లేనని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. సచిన్‌పైలట్ వర్గం తిరుగుబాటు వెనక భాజపా ఉందనేది ఈ డిమాండుతో తేలిపోయిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్‌ఖేరా చెప్పారు.
నేను భాజపాతోనే.. రాజె
కాంగ్రెస్ అంతఃకలహాలకు ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి రావడం దురదృష్టకరమని మాజీ ముఖ్యమంత్రి, భాజపా నాయకురాలు వసుంధరా రాజె అన్నారు. ఎడారి రాష్ట్ర వ్యవహారాలపై తొలిసారిగా ఆమె శనివారం ఈ మేరకు స్పందించారు. భాజపాపై బురద జల్లడాన్ని మానుకుని ప్రజా ప్రయోజనాలు పరమావధిగా ప్రభుత్వం పనిచేయాలని హితవు పలికారు. గహ్లోత్‌తో లోపాయికారీ రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలను ఖండిస్తూ, తాను భాజపా పక్షానే నిలుస్తానని చెప్పారు.
5 స్టార్ హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ఐదు నక్షత్రాల హోటల్లోని శిబిరానికి తరలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడ యోగా చేస్తూ, పాకశాస్త్ర నిపుణుల నుంచి వంటల చిట్కాలు తెలుసుకుంటూ సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.
గహ్లోత్ సర్కారుకు బీటీపీ మద్దతు
అశోక్ గహ్లోత్ సర్కారుకే తమ మద్దతు ఉంటుందని 'భారతీయ గిరిజన పార్టీ' (బీటీపీ)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ మేరకు గహ్లోత్ ట్వీట్ చేశారు.
గవర్నర్‌తో గహ్లోత్ భేటీ
సీఎం గహ్లోత్ శనివారం రాత్రి గవర్నర్ కల్‌రాజ్ మిశ్రతో 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. కరోనాను ఎదుర్కొనేందుకు చేపట్టిన చర్యల్ని వివరించడానికి ఈ సమావేశం మర్యాదపూర్వకంగా జరిగిందని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: దిల్లీ ఎయిమ్స్‌లో 'కొవాగ్జిన్' మానవ ప్రయోగాలకు అనుమతి