ముస్లిం మహిళల వివాహ హక్కుల కోసం ముమ్మారు తలాక్‌కు వ్యతిరేకంగా 2019, ఆగస్టు 1న ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఏడాది తర్వాత ముమ్మారు తలాక్ కేసుల సంఖ్య 82 శాతం తగ్గిందన్నారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రచురించిన వ్యాసంలో ఆగస్టు 1వ తేదీని ముస్లిం మహిళల హక్కుల దినోత్సవంగా ఆయన అభివర్ణించారు.
2019, ఆగస్టు1వ తేదీ భారత పార్లమెంటు చరిత్రలో మరిచిపోలేని రోజు. లౌకికవాదులని చెప్పుకునే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు అడ్డుపడినా ముమ్మారు తలాక్‌కు వ్యతిరేకంగా బిల్లు ఆమోదం పొందింది. ముస్లిం మహిళలకు రాజ్యాంగం కల్పించిన లింగసమానత్వం, ప్రాథమిక హక్కులకు బలం చేకూరింది. ఆనాటి బంగారు క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఓ సామాజిక భూతాన్ని అంతం చేయగలిగాం. వాస్తవానికి 1986లో సుప్రీం తీర్పు అనంతరమే ముమ్మారు తలాక్ బిల్లు ఆమోదం పొందాల్సి ఉన్నా కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా 2019 వరకు అమలుకు నోచుకోలేదు.
-ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి.