దేశం వరుస సవాళ్లు ఎదుర్కొంటోందని, కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కించడమే తొలి ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రసంగించారు.
దేశంలో సమగ్ర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్‌ను ప్రారంభించినట్లు గుర్తుచేశారు మోదీ. ఇందుకోసం రూ. 100 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు.
"భారత్‌ను ఆధునికత వైపు వేగంగా నడిపించడానికి దేశ సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. ఈ అవసరాన్ని జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్ ప్రాజెక్ట్ తీర్చుతుంది. దీనికోసం రూ .100 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసే దిశగా దేశం కదులుతోంది. "
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
మౌలిక సదుపాయాలలో కొత్త విప్లవానికి నాంది పలికే విధంగా వివిధ రంగాలకు చెందిన 7 వేల ప్రాజెక్టులను గుర్తించినట్లు తెలిపారు మోదీ. మౌలిక సదుపాయాల్లో గోతులు తొలగించే సమయం వచ్చిందని.. ఈ రంగంలో సవాళ్లనుద్దేశించి అన్నారు. దేశం మొత్తాన్ని మల్టీ-మోడల్ కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో అనుసంధానించడానికి భారీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

మరోవైపు, ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలన్నీ భారత్‌వైపు చూస్తున్నాయని అన్నారు ప్రధాని. భారత్‌లో తయారీతో స్వయం సమృద్ధి సాధించిన భారత్.. ఇప్పుడు ప్రపంచం కోసం తయారు(మేక్ ఫర్ వరల్డ్) చేయాలని పిలుపునిచ్చారు.