దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు 173మంది వైరస్ బారిన పడ్డారు. తాజాగా మహమ్మారికి మరో వ్యక్తి బలయ్యారు. దీంతో దేశంలో మరణాల సంఖ్య నాలుగుకి చేరింది.
రాష్ట్రాల్లో ఇలా..
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నూతన కేసులు నమోదవుతున్నాయి. గుజరాత్లో తొలి కరోనా కేసు నమోదైనట్లు తెలిపిన అధికారులు... రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరి సోకినట్లు స్పష్టం చేశారు. మహారాష్ట్రలో 49, కేరళలో 25, ఉత్తరప్రదేశ్‌లో 19, హర్యానాలో 17, కర్ణాటకలో 14, తెలంగాణలో 14, దిల్లీలో 14, లద్దాఖ్‌లో 8, రాజస్థాన్‌లో 7, జమ్ముకశ్మీర్‌లో 4, ఉత్తరాఖాండ్‌లో మూడు, తమిళనాడులో 2 కేసులు నమోదయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బంగాల్, పుదుచ్చేరి, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదైనట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి.
దేశవ్యాప్తంగా ఆంక్షలు..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను నియంత్రించేందుకు కేంద్రం మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ నెల 22వ తేదీ వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకలను నిలిపి వేస్తున్నట్లు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు కూడా థియేటర్లు, మ్యూజియంలు, పబ్‌లు, జిమ్‌లు, విద్యాసంస్థలు, పరీక్ష కేంద్రాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. అలాగే వివాహ కార్యక్రమాలు, క్రీడా పోటీలు, మతపరమైన వేడుకలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని దేశ వ్యాప్తంగా ఆదివారం (ఈ నెల 22) రోజున 'జనతా కర్ఫ్యూ' పాటించాలన్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు బయటకు రాకుండా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు.
ఇంటికే పరిమితం...
ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకునేలా(వర్క్ ఫ్రం హోం) వీలు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గ్రూప్ బీ, సీకి చెందిన 50శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని, మిగిలిన వారు కార్యాలయాలకు రావాలని సూచించింది.
ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యాధికారులు మినహా 65 ఏళ్ల దాటిన వయో వృద్ధులు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని స్పష్టం చేశారు. అలాగే పదేళ్ల లోపు చిన్నారులు కూడా రావద్దని కోరారు.
ఇదీ చూడండి:స్పైస్‌జెట్ సర్వీస్‌లు రద్దు- కరోనానే కారణం