దిల్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో దేశవ్యాప్తంగా తమ ఉనికిని చాటుకునే దిశగా అడుగులు వేస్తోంది ఆమ్ఆద్మీ పార్టీ. దేశంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 'సానుకూల జాతీయవాదం' పేరుతో ఆదివారం జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు ఆప్ సీనియర్ నేత గోపాల్ రాయ్ ఓ ముఖాముఖి వేదికగా వెల్లడించారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం పార్టీ నిర్ణయమని, ఇందులో భాగంగానే మొదటి విడతగా పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో పోటీచేసినట్లు గోపాల్ రాయ్ తెలిపారు.
ఈ సందర్భంగా భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు రాయ్. వారి జాతీయవాదం ప్రతికూలమైనదని పేర్కొన్నారు. త్వరలో ఆప్ చేపట్టనున్న సానుకూల జాతీయవాద ప్రచారం ద్వారా పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
"దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలనే ఎజెండాతో ఆదివారం జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ కార్యకర్తలు, కేడర్‌ను దేశం మొత్తంలో విస్తరించాలనే అంశమై చర్చించనున్నాం. దిల్లీలో చేపట్టిన ప్రయోగాత్మక పాలన యావత్ భారతానికి ఆదర్శం. అందరికీ మంచి విద్య, ఆరోగ్య సౌకర్యాలు, వసతి సౌకర్యాల కల్పన అనేవి మా సానూకూల జాతీయవాద విధానంలో భాగం."
-గోపాల్ రాయ్, ఆప్ సీనియర్ నేత
త్వరలో దేశ నిర్మాణం అనే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు రాయ్. ఇందులో భాగం కావాలనే ఔత్సాహికులు 9871010101 అనే నెంబర్‌కు మిస్స్డ్ కాల్ ఇవ్వాలని సూచించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, గుజరాత్ సహా దేశవ్యాప్తంగా పోటీలో నిలవనున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: సీఏఏ ఆందోళనలు హింసాత్మకం... నలుగురు పోలీసులకు గాయాలు