దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన వేళ గెలుపు కోసం ప్రచారంపై దృష్టి సారించాయి పార్టీలు. ప్రజలను తమ వైపు తిప్పుకొనేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు కేజ్రీవాల్‌పై 'లగే రహో కేజ్రీవాల్' అనే ప్రచార గీతాన్ని ఆవిష్కరించింది.
విశాల్ దద్లానీ స్వరపరచిన ఈ గీతాన్ని దిల్లీలోని ఆప్ పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ పాల్గొన్నారు.
"ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై దిల్లీ ప్రజలకు ఉన్న అభిమానం, ఆప్ ప్రభుత్వం సాధించిన విజయాలకు ఈ ప్రచార గీతం అద్దం పడుతోంది. దిల్లీ ప్రజల కోసం గత ఐదేళ్లలో మేము విశ్రాంతి లేకుండా శ్రమించాం. కేజ్రీవాల్ అందించిన పారదర్శక పాలన పట్ల ఎంతో సంతోషంగా ఉన్నామని దిల్లీ ప్రజలు చెబుతున్నారు."
-మనీశ్ సిసోడియా, దిల్లీ ఉపముఖ్యమంత్రి.
ఈ గీతం ప్రజల ప్రతిస్పందన మాత్రమే కాదని, రాబోయే ఐదేళ్లలో దిల్లీ నగర ప్రచారగీతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు సిసోడియా. గత ఎన్నికల ప్రచారంలోనూ 'పాంచ్‌సాల్ కేజ్రీవాల్' అనే ప్రత్యేక గీతాన్ని స్వరపరిచినట్లు గుర్తు చేశారు.
ఈ పాటను 'ఫ్లాష్ మాబ్‌గా' ప్రదర్శించటం కోసం 20 బృందాలను సిద్ధం చేశారని తెలిపారు సిసోడియా. రానున్న రోజుల్లో ఈ పాటకు వందల మంది నృత్యం చేస్తారని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ బృందాలు ప్రజలు సమూహంగా ఉన్న చోట, మార్కెట్లు, వీధుల్లో ప్రచార గీతాన్ని ప్రదర్శిస్తారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
ఫిబ్రవరి 8న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న ఫలితాలు వెలువడనున్నాయి.