దిల్లీలో లోక్‌సభ ఎన్నికల గడువు ముంచుకొస్తున్నా... కాంగ్రెస్ - ఆమ్ఆద్మీ మధ్య పొత్తు కొలిక్కి రాలేదు. సీట్ల సర్దుబాటులో రెండు పార్టీలు విభిన్న వాదనలతో ఉన్నాయి. మూడు సీట్లలో పోటీ చేస్తామని కాంగ్రెస్ భీష్మించగా.. రెండు సీట్లు మాత్రమే ఇస్తామని ఆప్ అంటోంది.
కాంగ్రెస్ ఈ ఒప్పందానికి అంగీకరిస్తే హరియాణాలోని ఛండీగఢ్ నుంచి పోటీ చేయబోమని హామీ ఇచ్చింది ఆప్. అయితే సమయం మించిపోతుండటం వల్ల ముందు జాగ్రత్తగా ఏడుగురు అభ్యర్థుల జాబితాను అధిష్ఠానానికి పంపారు దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్.
దిల్లీకే పరిమితం
ఆప్‌తో పొత్తు దిల్లీకే పరిమితం చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. హరియాణా, ఛండీగఢ్ల్లోనూ హస్తంతో పొత్తుకు ఆప్ సుముఖంగా ఉంది. పొత్తు కుదిరితే తూర్పు దిల్లీ, చాందినీ చౌక్ స్థానాలను కాంగ్రెస్ కోరే అవకాశం ఉంది. చివరి అవకాశంగా ఈ సీట్లలో దాఖలు చేయాల్సిన నామినేషన్‌ను వాయిదా వేసింది ఆప్. మోదీ-షా ద్వయం నుంచి దేశాన్ని రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
"పొత్తు కోసం కాంగ్రెస్‌కు చివరి అవకాశం ఇవ్వడంలో భాగంగా రెండు సీట్లకు నామపత్రాల దాఖలును శనివారం నుంచి సోమవారానికి వాయిదా వేస్తున్నాం."
-గోపాల్ రాయ్, ఆప్‌నేత
కుదరపోతే సోమవారం ముహూర్తం
దక్షిణ దిల్లీ, ఈశాన్య దిల్లీ, నూతన దిల్లీ స్థానాలకు ఆప్ తరఫున సోమవారం నామపత్రాలు దాఖలు చేయనున్నారు అభ్యర్థులు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోతే తూర్పు దిల్లీ, చాందినీ చౌక్ స్థానాలకూ ఆ రోజే నామినేషన్లు వేస్తారు.
దిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ఆరోదశలో భాగంగా మే 12న పోలింగ్ జరుగుతుంది.
రాహుల్‌కు అభ్యర్థుల పేర్లు
దిల్లీ లోక్‌సభ నియోజకవర్గాలకు నామ పత్రాల దాఖలుకు మంగళవారంతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఏడు నియోజకవర్గాల కోసం అభ్యర్థుల పేర్లను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపామని ఏఐసీసీ ఇన్ఛార్జీ పీసీ చాకో తెలిపారు.
ఇదీ చూడండి: మోదీ బయోపిక్ విడుదల కష్టమేనా.!