ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో కదంఝరియాలో నివాసం ఉంటాడు ఆదివాసీ తెగకు చెందిన బుటూ రామ్. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు 40 కిలో మీటర్లు కాలినడకన వచ్చాడు. ఉపాధి లేక చేతిలో ఛార్జీలకు డబ్బులేక నడిచొచ్చాడు. తమ కోసం సర్కారు పథకాలు ఎన్నున్నా ఇంకా ఇలాంటి దుస్థితిలోనే మగ్గుతున్నారు ఎందరో గిరిపుత్రులు.
ఐదేళ్ల క్రితం అతన్ని భార్య వదిలేసి వేరొకరితో వెళ్లిపోయింది. తన ముగ్గురు కొడుకులు అతనితోనే ఉంటున్నారు. కొంత కాలం క్రితం ఆమె అతను ఇంట్లో లేని సమయంలో వచ్చి ముగ్గురు పిల్లల్ని తీసుకుని వెళ్లిపోయింది. ముగ్గురూ 7 నుంచి 13 ఏళ్ల మధ్య వయసున్న బాలురే. తన ముగ్గురు పిల్లలను తీసుకుని వెళ్లిపోవటంపై కలత చెందాడు బుటూరాం. తన పిల్లలను ఎలాగైనా తన వద్దకు తెచ్చుకోవాలనుకున్నాడు.
ఇదే అంశంపై ఫిర్యాదు చేసేందుకు 40 కి.మీ నడిచి పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. కదంఝరియాలోని వారి గూడెం నుంచి కోర్బాలోని పోలీస్ ప్రధాన కార్యాలయానికి సాయంత్రమనగా బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నానికి చేరుకున్నాడు.
అవును కాలి నడకన వచ్చాను.. నిన్న సాయంత్రం బయలుదేరాను. కదంఝరియా నుంచి 20 కి.మీ... లోపలికి ఓ 20 కి.మీ .. మొత్తం 40 కి.మీ నడిచాను. డీఎస్పీ సార్ నాకు తిరుగు ప్రయాణానికి డబ్బులిచ్చాడు.
-బుటూరాం, ఆదివాసీ
భార్యా, బిడ్డలు దూరమైన అతను ఇన్నాళ్లు ఒక్కడే కాలం వెళ్లదీసాడు. కానీ ఎంత కాలం ఇలా అనుకున్నాడు. పిల్లలు కూడా వెళ్లిపోయి ఏకాకిగా మారిన తన జీవితానికో దారి చూపమంటూ పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నాడు.
నడిచే వచ్చానంటున్నాడు. ఊర్లో పశువులు మేపుతానంటున్నాడు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నానని చెబుతున్నాడు.
-రాంగోపాల్,డీఎస్పీ
ఆకలితో అలమటిస్తూ వచ్చిన బుటూరాంకు అన్నం పెట్టి మానవత్వం చాటారు డీఎస్పీ రాంగోపాల్ కరియారే. ఫిర్యాదు తీసుకుని... అతన్ని సముదాయించి తిరుగు ప్రయాణానికి డబ్బులిచ్చి పంపించారు.