మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. శివసేన, భాజపా మరోసారి సంయుక్తంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చినట్లు భాజపా మంత్రి, సీనియర్ నేత చంద్రకాంత్ పాటిల్ తెలిపారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేలు ఈ విషయంపై త్వరలోనే సంయుక్తంగా అధికారిక ప్రకటన చేస్తారని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థులు కొంతమందికి నిన్న ఏబీ ఫారాలు ఇచ్చారు ఉద్దవ్ ఠాక్రే. ఆ మరుసటి రోజే సీట్ల పంపకం పూర్తయింది.
ఠాక్రే వంశం నుంచి తొలిసారి ఎన్నికల బరిలో ఆదిత్య..
ఠాక్రే వంశానికి చెందిన వ్యక్తి తొలిసారి మహారాష్ట్ర ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే.. ముంబయిలోని వర్లీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ముంబయిలో శివసేన నిర్వహించిన ర్యాలీలో అధికారికంగా ప్రకటించారు ఆదిత్య. పార్టీ కార్యకర్తల ఆశీర్వాదంతో తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
వర్లీ... శివసేనకు అత్యంత అనువైన నియోజకవర్గం. ఆదిత్య ఠాక్రే పోటీ చేస్తున్నారని తెలిసి ఎన్సీపీ నేత సచిన్ అహిర్ ఇటీవలే సేనలో చేరారు. దీంతో ఆదిత్య విజయం సునాయాసమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
1966లో బాల్ ఠాక్రే శివసేన పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి ఆ కుటుంబానికి చెందిన ఏ ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తొలిసారి ఆదిత్య ఠాక్రే బరిలోకి దిగుతున్నారు.
ఇదీ చూడండి: హరియాణా ఎన్నికలు: భాజపా తరఫున బరిలో క్రీడాకారులు