ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకోవడం కోసం మహారాష్ట్రలో భాజపా, శివసేన మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారిని కలిశారు శివసేన నేతలు. ఆదిత్య ఠాక్రే, శివసేన శాసనసభాపక్షనేతగా ఎన్నికైన ఏక్నాథ్ శిందే, నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు సహా పలువురు కీలక నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కోసం భాజపా, శివసేన ఇద్దరూ వెనక్కి తగ్గకపోవడం వల్ల గవర్నర్‌తో శివసేన నేతల భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
రైతులను ఆదుకోవాలని విన్నపం
అయితే ఇటీవలే మహారాష్ట్రలో కురిసిన అకాల వర్షాలకు చాలా మంది రైతులు నష్టపోయారని.. వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేయడానికే గవర్నర్‌ను కలిసినట్టు శివసేన నేతలు తెలిపారు. భారీ వర్షాలతో రైతులు నష్టపోయిన నేపథ్యంలో రాష్ట్రానికి కరవు నిధులు అందజేయాలని గవర్నర్‌ను కోరినట్టు తెలిపారు. సాధ్యమైనంత తొందరగా సహాయం అందించాలని ఆదిత్య ఠాక్రే విజ్ఞప్తి చేశారు.
'ఇటీవలే కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులు, జాలర్లను ఆదుకోవాలని గవర్నర్‌కు విన్నవించాం. వారికి ఆర్థికంగా చేయూతనివ్వాలని కోరాం. దీనికి గవర్నర్ సానుకూలంగా స్పందించారు. రైతులకు భరోసా ఇచ్చేలా కేంద్రంతో తానే మాట్లాడతానని హామీ ఇచ్చారు.'
-ఆదిత్య ఠాక్రే