ఉగ్రవాదంతో పాటు పేదరికాన్ని పోగొట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం తనను పదవి నుంచి తొలగించేందుకు చూస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. కర్ణాటక కాలబుర్గీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగసభలో ప్రసంగించారు.
ఇప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందన్నారు మోదీ.
ప్రస్తుతం ప్రపంచం చూస్తోన్న ధైర్యం మోదీది కాదు. 120 కోట్ల భారతీయులది. -నరేంద్ర మోదీ,ప్రధాన మంత్రి
జేడీఎస్-కాంగ్రెస్ సర్కారుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రధాని. రాష్ట్ర ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉందని, కుమారస్వామి 'రిమోట్ కంట్రోల్ సీఎం' అని ఎద్దేవా చేశారు. 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' పథకం అమలుకు సహకరించకుండా కర్ణాటక ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఇలాంటి వారికి రైతులే గుణపాఠం చెబుతారని అన్నారు.
దేశంలోని రైతుల ఖాతాల్లో డబ్బులు వేశాం. కానీ కర్ణాటక రైతుల ఖాతాల్లో వేయలేకపోయాం. దీనికి కారణం రైతు వ్యతిరేక జేడీఎస్- కాంగ్రెస్ సర్కారు. వ్యవసాయదారులారా... రైతు విరోధులను క్షమించకండి. - నరేంద్ర మోదీ.