ఎందరినో ముప్పుతిప్పలు పెట్టిన లాక్డౌన్.. మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబంలో మాత్రం సంతోషాన్ని నింపింది. నాలుగేళ్ల కింద తప్పిపోయిన ఓ అమ్మాయి.. తిరిగి తన సోదరుడిని చేరుకుంది.
మహారాష్ట్ర లాథూర్కు చెందిన ప్రసన్న జోషి సోదరి నాలుగేళ్ల కింద కనబడకుండా పోయింది. తోబుట్టువు కోసం జోషి వెతకని చోటంటూ లేదు. పోలీసులకూ ఫిర్యాదు చేశాడు. రెండేళ్లు వెతికినా సోదరి ఆచూకీ దొరకలేదు. దీంతో ఆశలు వదులుకున్నాడు.
అయితే, లాక్డౌన్ వేళ కర్ణాటక బళ్లారి హోస్పేట్లో తిరుగుతూ కనిపించింది జోషి సోదరి. కరోనా జాగ్రత్తలు విస్మరించి బయట తిరుగుతున్న ఆమె మహిళా-శిశు సంక్షేమ అధికారుల కంటబడింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని, స్థానిక డిప్యూటీ కమిషనర్ ఎస్ ఎస్ నకుల్కు సమాచారమిచ్చారు.
నకుల్ బృందం ఆమె చిరునామా కోసం విచారించారు. కానీ, మతిస్థిమితం సరిగ్గా లేక ఆమె చిరునామా చెప్పలేకపోయింది. దీంతో, ఆమె ఫొటో ఫేస్బుక్లో పెట్టి సమాచారం కోసం ప్రయత్నించారు పోలీసులు. ఆ పోస్టు పెట్టిన 2 నెలలకు జోషి.. సోదరి ఫొటో చూసి గుర్తుపట్టాడు. వెంటనే సోదరిని కలిసేందుకు కర్ణాటక పోలీసులను ఆశ్రయించాడు. ఎప్పటికీ తిరిగి రాదనుకున్న సోదరిని కలిపినందుకు కర్ణాటక పోలీసులకు, మహిళా-శిశు సంక్షేమ అధికారులకు కృతజ్ఞతలు తెలిపాడు.
ఇదీ చదవండి:ఆడుకున్న ఇంటిని కూల్చేశారు.. ఆడించిన నాన్నను చంపేశారు!