గుజరాత్లో దారుణ ఘటన వెలుగుచూసింది. సురేంద్ర నగర్ జిల్లాలో ఓ వ్యక్తి తన అత్తింటివారిపై పట్టపగలే కత్తులతో దాడికి దిగాడు. మామ, మరదలిపై దాడి చేయగా.. వారు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అడ్డొచ్చిన భార్య, తొడల్లుడినీ తీవ్రంగా కొట్టి గాయపరిచాడు.
ఇదీ జరిగింది..
జిల్లాలోని ములి గ్రామానికి చెందిన భరత్ కోర్దియాకు మీనాతో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. దాదాపు నెలన్నర రోజులు నుంచి సరోది గ్రామంలోని పుట్టింటిలోనే ఉంటోంది మీనా. ఈ విషయమై ఆగ్రహానికి లోనైన భరత్.. పట్టపగలు అందరూ చూస్తుండగానే రెండు చేతుల్లో కత్తులు పట్టుకొని అత్తమామల ఇంటికి వచ్చాడు. వచ్చీరాగానే అతడి మామ దమ్జీ భాయ్‌తో గొడవకు దిగాడు. మాటామాటా పెరగడం వల్ల ఆవేశానికి లోనైన భరత్.. అతడిని కత్తితో పొడిచాడు. భార్య చెల్లెలు సోనాల్‌బెన్.. తన తండ్రిని రక్షించేందుకు అడ్డొచ్చింది. ఆమెపైనా దాడికి దిగి.. పొట్ట, ఛాతీ భాగంలో పొడిచాడు. ఇంతలో భార్య మీనా, సోనాల్‌బెన్ భర్త లలిత్ భాయ్‌లు.. భరత్‌ను ఆపే ప్రయత్నం చేయగా.. వారినీ తీవ్రంగా గాయపరిచాడా నిందితుడు.
ఆ ఇంట్లో గావుకేకలు విన్న ఇరుగుపొరుగు వారంతా.. దమ్జీ భాయ్ ఇంటికి చేరుకున్నారు. ఘటనకు కారణమైన భరత్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. గాయపడిన మీనా, లలిత్‌లను స్థానిక సివిల్ ఆస్పత్రిలో చేర్పించారు.
ఈ పూర్తి వ్యవహారంపై సురేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: కూలిన మిగ్-21 యుద్ధవిమానం- తప్పిన ప్రమాదం