"మహిళా సాధికారత విభాగంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు గెలుచుకున్నా. రాష్ట్రపతి చేతులమీదుగా కరమ్వీర్ అవార్డు కూడా అందుకున్నా. ఈ అవార్డులన్నీ నావి మాత్రమే కాదు. 22వేల మంది మహిళలందరివీ."
- రూమాదేవి
ప్రతిభకు చిత్తశుద్ధి తోడైతే.. సాధించలేనిదేదీ ఉండదంటారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు గెలుచుకున్న రూమాదేవి ఈ మాటలు నిజమని నిరూపిస్తోంది.
'హార్వర్డ్'లో ప్రసంగించే స్థాయికి..
రూమాదేవి గత జీవితమంతా కష్టాల కడలే. ఆమె పెద్దగా చదువుకోలేదు. ఎంబ్రాయిడరీ కళ నేర్చుకుంది. బార్మర్ నుంచి వచ్చిన అలాంటి ఓ సాధారణ మహిళ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించే స్థాయికి ఎదిగి.. ఆదర్శంగా నిలుస్తోంది. కశీదేకారీ కళతో తన ప్రస్థానం ప్రారంభించిన రూమాదేవి.. పెద్ద డిజైనర్లతో కలిసి ఫ్యాషన్ షోల కోసం పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖ డిజైనర్లు, మోడళ్లకు ఆమె దుస్తులు డిజైన్ చేసి ఇచ్చింది.
"ప్రతి పనిలోనూ కష్టముంటుంది. ఆ కష్టాలను దాటుకుని, ఎంత ఎత్తుకు ఎదిగామన్నదే ముఖ్యం. మేం చేస్తున్న పని మాకు చాలా సంతోషాన్నిస్తోంది. ఈ పని వల్ల చాలామంది అక్కాచెల్లెళ్లకు ఉపాధి లభిస్తోంది.
- రూమాదేవి
"రూమాదేవితో కలిసి ఓ ఫ్యాషన్ షోకు వెళ్లాను. నేను ఊర్లో ఉంటాను. మేం రూపొందించిన దుస్తులు ధరించి ర్యాంప్ చేసిన మోడళ్లను చూడటం నాకెంతో సంతోషాన్నిచ్చింది."
- సుగానీ దేవి
చిన్న వయసులోనే చదువకు దూరమై..
1988లో బార్మర్‌లోని రావాత్సార్ అనే ఓ చిన్న గ్రామంలో జన్మించింది రూమాదేవి. నాలుగేళ్ల చిన్నవయసులోనే తల్లిని కోల్పోయిన ఆమె.. దేశంలోని ఎంతోమంది అమ్మాయిల్లాగే 8వ తరగతిలోనే చదువుకు దూరమైంది. మధ్యలోనే బడి మాన్పించి, ఆమెకు పెళ్లి చేశారు. సరైన వైద్య సహాయం అందక, పుట్టిన రెండోరోజే బిడ్డను కోల్పోయింది రూమాదేవి. ఆ తర్వాత ఏదైనా కొత్తగా చేయాలని సంకల్పించుకుంది. ఇప్పటివరకూ 22వేల మంది మహిళలకు ఉపాధి కల్పించింది.
"నాకు మొదటి సంతానం కలిగినప్పుడు నావద్ద ఒక్క రూపాయి కూడా లేదు. అందుకే నా బిడ్డ చనిపోయాడు. నాదగ్గర డబ్బులే ఉండుంటే అలా జరగనిచ్చేదాన్ని కాదు. మంచి ఆసుపత్రిలో వైద్యం చేయించేదాన్ని. ఆ తర్వాతే ఈ పని చేసి, డబ్బు సంపాదించాలని అనుకున్నాను."
- రూమాదేవి
రాష్ట్రపతి చేతులమీదుగా 'నారీశక్తి'..
గత సంవత్సరం నారీ శక్తి పురస్కారాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా అందుకుంది రూమాదేవి. ప్రముఖ 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమం కూడా ఆమెకు ఆహ్వానం అందించింది. ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రూమాదేవి పేరు.. మహిళా సాధికరత కోసం పనిచేస్తున్న వారిలో ప్రధానంగా వినిపిస్తోంది. నైపుణ్యాలుండి, కాస్త ధైర్యం చేయగలిగితే గమ్యం చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నిరూపిస్తోంది రూమాదేవి.
ఇదీ చదవండి: ఆమె రొట్టెలకు భలే గిరాకీ.. 200 మందికి ఉపాధి