మహారాష్ట్ర నుంచి కేరళకు చేరుకోవటానికి మహా అయితే రెండు రోజుల సమయం పడుతుంది. కానీ ఓ ట్రక్కుకు మాత్రం ఏడాది సమయం పట్టింది. ఏంటీ ఆశ్చర్య పోతున్నారా? అవునండి ఇది నిజమే! మహారాష్ట్ర నాసిక్ నుంచి అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన అధునాతన యంత్రాలతో బయలు దేరిన ఓ టక్కు ఏడాది తర్వాత కేరళ తిరువనంతపురానికి చేరుకుంది. ఈ ఆటోక్లేవ్ యంత్రాలను విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి తరలిస్తున్నట్లు సంబంధిత సిబ్బంది వెల్లడించారు.
మహారాష్ట్రలో జులై 2019లో బయలుదేరిన మేము 4 రాష్ట్రాలను దాటుకుంటూ నగరానికి చేరుకున్నాము.
-ట్రక్కు సిబ్బంది.
రోజుకు ఐదు కిలోమీటర్ల ప్రయాణం
మహారాష్ట్ర నుంచి బయలు దేరిన ట్రక్కు రోజుకు ఐదు కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించేది. ఇలా ఏడాది పాటు నాలుగు రాష్ట్రాలను దాటుకుంటూ తిరువనంతపురానికి చేరుకున్నట్లు సిబ్బంది తెలిపారు. ఈ ఆటోక్లేవ్ యంత్రం 70 టన్నుల బరువు ఉందని, ఎత్తు, వెడల్పు వరుసగా 7.5, 6.5 మీటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనల కోసం ఈ యంత్రాన్ని మహారాష్ట్ర నాసిక్‌లో తయారు చేశారు. మొత్తం 32 మంది సిబ్బంది ఈ యంత్రాన్ని జాగ్రత్తగా కేరళకు తరలించారు.
ఇదీ చూడండి:రఫేల్ మోహరింపుపై వాయుసేన ఉన్నతాధికారుల చర్చ