దేశమంతా ఎన్నికల సందడే. ఏప్రిల్ 18న రెండో దశ పోలింగ్. 13 రాష్ట్రాల్లోని 97 సీట్లకు ఓటింగ్. బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య 1,644. అందులో 1,590మంది ఈసీకి సమర్పించిన ప్రమాణపత్రాలను పరిశీలిస్తే... 16శాతం అంటే 251 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. 167మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. అభ్యర్థులు ఎలాంటి వారో తెలిసినా... మనస్ఫూర్తిగా ఓటేయగలమా? వేయలేకపోతే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం... నోటా(నన్ ఆఫ్ ద ఎబోవ్).
'అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్' నివేదిక ప్రకారం... 2013-17 మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2014 సార్వత్రిక ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్లు... 1.33 కోట్లు. అంటే ప్రజల్లో ఎంత అసమ్మతి పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. బరిలో సరైన అభ్యర్థులు లేరని ప్రజలు తిరస్కరిస్తున్నారు.
ఎన్నోసార్లు ఎన్నికల్లో.. బరిలో నిలిచిన కొన్ని రాజకీయ పార్టీల కంటే నోటాకు అధిక ఓట్లు పోలయ్యాయి.
- గెలిచిన అభ్యర్థి మెజారిటీ కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చిన సందర్భాలు కోకొల్లలు.
- 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్ల శాతం... భాజపా, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థుల ఓట్ల శాతం కంటే మాత్రమే తక్కువ. 118 సెగ్మెంట్లలో భాజపా, కాంగ్రెస్ తర్వాత 'నోటా'నే నిలిచింది.
- 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ జాతీయ పార్టీలు సీపీఎం, బీఎస్పీ... 'నోటా' వెనుకే నిలిచాయి.
- 2018 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన భాజపా, రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్కు మధ్య ఓట్ల తేడా 0.1 శాతం మాత్రమే. అదే సమయంలో 'నోటా' 1.4 శాతం ఓట్లు సాధించింది.
- 2జీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న డీఎంకే అభ్యర్థి ఏ రాజా 2014 లోక్సభ ఎన్నికల్లో.. ఏఐఏడీఎంకే అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇక్కడ నోటా మూడో స్థానంలో నిలిచింది. అవినీతి అభ్యర్థుల విషయంలో ప్రజాభిప్రాయంపై ఇది ఒక సంకేతంలా నిలిచింది.
''మీరు ఓటర్లకు అభ్యర్థుల విషయంలో సరైన ఎంపిక ఇవ్వకపోతే వారేం చేస్తారు? నోటా ద్వారా ఒక చిన్న అవకాశమైనా ఇవ్వండి. క్రియాశీల రాజకీయ పార్టీల పట్ల తమ వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీల వైఫల్యాన్ని.. ఈ మార్గం ద్వారా ఎత్తిచూపే అవకాశం ఓటర్లకు దక్కుతుంది.
బరిలో నిలిచిన అభ్యర్థుల పట్ల పౌరుల అసంతృప్తికి ఎన్నో కారణాలున్నాయి. వారు తప్పకుండా నోటా ఎంపికకు మొగ్గుచూపుతారు. అప్పుడు రాజకీయ పార్టీలకూ తాము సరైన అభ్యర్థినే బరిలో ఉంచామా.. లేదా అనే దానిపై స్పష్టమైన అవగాహన వస్తుంది''
- కమల్ కాంత్ జైస్వాల్, విశ్రాంత ప్రభుత్వాధికారి
ఇలా పుట్టింది...
'నోటా' కోసం పౌరహక్కుల ప్రజా సంఘం(పీయూసీఎల్) సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. 'బ్యాలెట్ పత్రాలు లేదా ఈవీఎంలలో తప్పనిసరిగా 'నన్ ఆఫ్ ద ఎబోవ్' (నోటా) ఐచ్ఛికం తీసుకురావాలని సుప్రీంకోర్టు... ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 'ఏ అభ్యర్థీ నచ్చని ఓటర్లకు.. వారి గోప్యత హక్కుకు భంగం వాటిల్లకుండా ఇది ఉపయోగపడుతుంది' అని తన తీర్పులో పేర్కొంది న్యాయస్థానం.
సుప్రీం తీర్పుతో ఈసీ 'నోటా'ను 2013 అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకొచ్చింది. ఛత్తీస్గఢ్, మిజోరం, రాజస్థాన్, దిల్లీ, మధ్యప్రదేశ్ ఓటర్లే మొదటిసారిగా వినియోగించుకున్నారు. అనంతరం.. 2014 లోక్సభ ఎన్నికల్లోనూ ప్రవేశపెట్టారు.
నోటాపై మరికొన్ని వివరాలు...
- 2014లో 'నోటా'ను రాజ్యసభ ఎన్నికల్లోనూ పరిచయం చేశారు.
- 'నోటా'కు 2015లో ప్రత్యేక గుర్తును కేటాయించింది ఈసీ. తొలుత గాడిద గుర్తును కేటాయించాలని డిమాండ్లు వచ్చాయి.
ఏదైనా ఎన్నికల్లో నోటాకే అధిక ఓట్లు పోలైతే.... అభ్యర్థుల్లో తొలి స్థానంలో నిలిచిన వ్యక్తి విజేత. కానీ... ఈ విధానంలో మార్పులు చేయాలని అనేక మంది కోరుతున్నారు.
'ఎన్నికల్లో 'నోటా' గనుక విజయం సాధిస్తే, ఎక్కువ ఓట్లు వస్తే.. ఆ నియోజకవర్గంలో తిరిగి ఎన్నికలు నిర్వహించే చట్టం లేదా నిబంధన తీసుకురావాలి. అలాగే.. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిని మళ్లీ నిల్చోకుండా నిషేధించాలి.'
- కమల్ కాంత్ జైస్వాల్, విశ్రాంత ప్రభుత్వాధికారి
నోటాకు ప్రాధాన్యం పెంచడానికి, ఎన్నికల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు కొందరు నిపుణులు, విశ్లేషకులు చేసిన సూచనలు...
- నోటా అధిక ఓట్లు సాధిస్తే.. ఆ నియోజకవర్గంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలి.
- నోటాకు నిర్దేశించిన మేర ఓట్ల శాతం వస్తే రీపోలింగ్ జరపాలి.
- తిరిగి ఎన్నికలు నిర్వహించే తరుణంలో 'నోటా'ను ఈవీఎంలలో తీసేయాలి.
- నోటా చేతిలో ఓడిన అభ్యర్థులను నిర్దేశిత కాలం వరకు ఎన్నికలకు దూరంగా ఉంచాలి(చాలా మంది 6 ఏళ్లుగా పేర్కొన్నారు)
- నోటా కంటే అభ్యర్థులకు తక్కువ ఓట్లు వస్తే... భవిష్యత్తులో వారిని తిరిగి ఎన్నికలకు అనర్హులుగా ప్రకటించాలి.
- అభ్యర్థుల మెజారిటీ కంటే.. నోటాకు అధిక ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు జరపాలి.
హోరాహోరీగా జరుగుతున్న ప్రస్తుత సార్వత్రిక సమరంలో నోటా వాటా ఎంతో మే 23న తేలనుంది.
ఇవీ చూడండి: