గణతంత్ర దినోత్సవం రోజు చేపట్టిన రైతుల ట్రాక్టర్ ర్యాలీలో హింసాత్మక ఘటనలపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇప్పటికే 33 ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా.. 44 మందికి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఆధారాల సేకరణ..
హింసాత్మక ఘటనలపై ఆధారాల కోసం ఘాజీపుర్ సరిహద్దుకు ఫోరెన్సిక్ నిపుణుల బృందం, క్రైమ్ బ్యాంచ్ అధికారులు వెళ్లారు. సరిహద్దులోని వివిధ ప్రాంతాల నుంచి నమూనాలు సేకరించారు.
సమాచారం అందించండి..
దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన హింసాత్మక ఘటనలపై ఏవైనా ఆధారాలు, సమాచారం ఉంటే తమకు అందించాలని ప్రజలను కోరారు దిల్లీ పోలీసులు.
"దిల్లీ ఘటనలపై సమాచారం ఉన్న ప్రజలు, మీడియా వ్యక్తులు, తమ ఫోన్లలో, కెమెరాల్లో ఘటనలను బంధించిన వారు ఎవరైనా మాకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం. తమ వద్ద ఉన్న ఫోటోలు, వీడియోలను పాత దిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయంలోని రెండో అంతస్తులో రూమ్ నంబర్ 215లో ఏ రోజైనా పనివేళల్లో అందించవచ్చు. 8750871237, 011-23490094కు సమాచారం ఇవ్వొచ్చు. kisanandolanriots.26jain2021@gmail.com ఈమెయిల్ చేయొచ్చు. "
- దిల్లీ పోలీసు విభాగం
ఇదీ చూడండి: సింఘులో మళ్లీ ఉద్రిక్తత- పోలీసుల లాఠీఛార్జి