చిత్తూరు జిల్లా, కుప్పం సమీపంలోని ఎంకేపురంలో మిల్లెట్ బ్యాంక్ ఉంది. ఇదే గ్రామానికి చెందిన విశాలరెడ్డి రూపకర్త. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార ఆసక్తి ఉన్నవారికి శిక్షణనిచ్చే ఆమె.. రైతులకు ఆసరాగా నిలబడాలనే లక్ష్యంతో సొంతూరికి తిరిగి వచ్చింది. ఒకప్పుడు కొర్రలు, సామలు, అరికలు, ఊదర్లు వంటి తృణధాన్యాలు సాగు చేసిన రైతులంతా క్రమంగా వాణిజ్య పంటల వైపు మొగ్గడం గుర్తించింది. కారణాలపై పరిశోధించి పరిష్కారంగా మిల్లెట్ బ్యాంక్ నెలకొల్పింది.
"చుట్టుపక్కల విత్తనాలు భద్రపరిచే రైతులను గుర్తించి, వారి నుంచి ఆ విత్తనాలు సేకరించి, అవసరమున్న రైతులకు సరఫరా చేస్తున్నాం. ప్రాచీన వ్యవసాయ పద్ధతులు చాలామంది కొత్త తరం రైతులకు తెలియవు. పాత రైతులను తీసుకొచ్చి, యువరైతులకు సమాచారం అందించేందుకు వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాం."
- విశాలరెడ్డి, మిల్లెట్ బ్యాంక్ వ్యవస్థాపకురాలు
తృణధాన్యాల సాగుకు 50మందిని ఒప్పించిన మిల్లెట్ బ్యాంక్ నిర్వాహకులు... అనుభవం ఉన్న కర్షకులతో యువరైతులకు మెళకువలు చెప్పిస్తున్నారు. సేంద్రీయ పద్ధతుల్లో తృణధాన్యాలు సాగు చేస్తూ, మంచి లాభాలు పొందుతున్న వారి అనుభవాలు, వ్యవసాయ అధికారుల సూచనలు రైతులకు అందిస్తూ, అన్నదాతల రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
"గ్రామస్థాయిలో ఈ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి, దాని ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తున్నాం. రైతులు, వినియోగదారులకు మధ్య ఏర్పడిన దూరాన్ని పూరించాలి. రైతులే దీంట్లో ప్రధాన పాత్ర పోషిస్తారు. రైతులు, రైతుల పిల్లలే దీంట్లో క్రియాశీలకంగా ఉంటారు."
- విశాలరెడ్డి
ప్రస్తుతం 25ఎకరాల్లో ప్రయోగాత్మకంగా మిల్లెట్స్ సాగు చేపట్టారు. ఉత్పత్తిదారుసంఘంలో రైతులకు సభ్యత్వం ఇప్పించి, ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే అవకాశం కల్పించేందుకు ప్రణాళిక చేస్తోంది మిల్లెట్ బ్యాంక్. విభిన్న పనిముట్లు, విత్తనాలను ప్రదర్శనకు ఉంచి, అవగాహన కల్పిస్తోంది.
"రైతుల చేత కొర్రలు, సామలు, అరికలు, ఊదలు, అండకొర్రలు, రాగులు సాగుచేయిస్తున్నాం. లేదనే మాట లేకుండా మిల్లెట్ బ్యాంక్‌ను నిర్వహిస్తున్నాం."
- శివారెడ్డి, మిల్లెట్ బ్యాంక్ నిర్వాహకుడు
'చాలామంది రైతులకు పండించడం తెలుసు. కానీ ఎక్కడ అమ్మాలో తెలియదు. మిల్లెట్ బ్యాంక్ అలాంటి వాళ్లకి ఓ పరిష్కారం చూపుతుంది. ఎలా చేయాలి? ఏం చేయాలి? అని చెప్తుంది. అని మిల్లెట్ బ్యాంక్ నిర్వాహకురాలు చందన తెలిపింది.
ఆమె ద్వారా రైతులంతా బాగా ప్రోత్సాహం అందుకుని, ఇప్పుడందరూ సామలు చల్లుతున్నారు. కొర్రలు చల్లుతున్నారని జయరామిరెడ్డి అనే రైతు చెప్పారు.
రైతులకు అండగా నిలవాలన్న తన కలను మిల్లెట్ బ్యాంక్ ద్వారా సాకారం చేసుకుంది విశాల. వివిధ కారణాల వల్ల తృణధాన్యాల సాగుకు దూరమైన రైతులందరినీ...తిరిగి సంప్రదాయ పద్ధతుల్లో తృణధాన్యాలు పండించేలా చేస్తూ సొంతూరి రుణం తీర్చుకుంటోంది. రైతులంతా స్వయం సమృద్ధి సాధించేలా మిల్లెట్ బ్యాంక్ సేవలు విస్తరిస్తానని ధీమాగా చెబుతోంది.
ఇదీ చూడండి: 'పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు చర్యలు'