ఒడిశా, భువనేశ్వర్ బాపూజీనగర్ వీధిలో అలా నడుస్తూ వెళితే.. ఓ చోట పాత బైకులు, మనం ఏనాడూ చూడని కార్లు వరుసగా దర్శనమిస్తాయి. అయితే, ఇదేదో షోరూమో, పార్కింగ్ ఏరియానో అనుకునేరు.. కాదు.. ఇది గహర్ అబెదిన్ ఇల్లు. ఆ పురాతన బైకులు, కార్లన్నీ గహర్ వే. పాత కాలపు వాహనాలు, వాచీలు సేకరించే వింత అలవాటున్న అబెదిన్.. ఇప్పుడు వాటితోనే తెగ ఫేమస్ అయిపోయాడు.
పాతవే ప్రియం...
అబెదిన్ ఇంటి ముందు ఇప్పటి వరకు దాదాపు 80 పురాతన బైకులు, బ్రిటిష్ కాలం నాటి 10 కార్లున్నాయి. ఇక ఇంట్లో పాత సినిమాల్లో మాత్రమే కనిపిస్తున్న దాదాపు 200 పాత వాచీలున్నాయి. అయితే అన్నేసి బైకులు, కార్లు, వాచీలు సేకరించడం చూసి అబెదిన్ బాగా రిచ్ అనుకునేరు. కాదు, వీటిని సేకరించడానికి ఒక్కోసారి అతడు నెల మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బంతా ఖర్చు చేసేస్తాడు.
అబెదిన్ అలవాటుకు అతడి భార్య పింకీ సైతం సహకరిస్తోంది. వచ్చిన డబ్బంతా విలాసాలకు తగలేస్తున్నాడని తిట్టకుండా తోడ్పడుతోంది.
పురాతన వస్తువుల విలువ తెలియక చాలా మంది వాటిని చెత్తకుప్పల్లో పడేస్తున్నారు. కానీ, అబెదిన్ మాత్రం బోలెడంత డబ్బు పోసి ఈ వస్తువులను కొనుగోలు చేస్తున్నాడు. ఆ కాలం స్మృతులను ఈ తరానికి చూపించాలని ప్రయత్నిస్తున్నాడు. భవిష్యత్తులో ఈ వస్తువులతో ఆ గ్రామంలో ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు.
ఇదీ చదవండి: పోలీస్ స్టేషన్లో 16 నాగరాజులు మకాం!