ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణ కోసం పోరాడే సైనికులకు రక్షణ కల్పించేందుకు ఐరన్‌సూట్‌ను రూపొందించాడు ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన శ్యామ్ చౌరాసియా. ఐరన్ మ్యాన్ స్ఫూర్తితో ఈ సూట్‌ను తూటాలను తట్టుకునే విధంగా రూపొందించారు.
వారణాసిలోని 'అశోక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్'లో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న శ్యామ్...ఈ ఐరన్ సూట్‌ను అభివృద్ధి చేశారు. భారత సైనికులు.... శత్రువులతో పోరాడే సమయంలో ప్రాణ నష్టం కలగకుండా ఉండేందుకు ఈ సూట్‌ను రూపొందించానని శ్యామ్ వివరించారు.
ఎటువైపు నుంచి దాడి చేసినా తట్టుకునేలా ఐరన్ సూట్‌ను రూపొందించారు. ఈ సూట్ తయారీకి గేర్లు, మోటార్లు ఉపయోగించారు. యుద్ధ సమయాల్లో ఈ ఐరన్ సూట్ సైనికులకు ఎంతో సహాయపడుతుందని శ్యామ్ అన్నారు అయితే తాను రూపొందించింది కేవలం నమూనా మాత్రమే అని...దానిని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ నమూనాను మరింత అభివృద్ధి చేసేందుకు.. శ్యామ్ నిధుల కోసం ప్రయత్నిస్తున్నారు.
ఈ ఐరన్‌సూట్‌లో ఆటోమేటిక్‌గా పనిచేసే పరికరాలు అమర్చాం. ఈ సూట్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. చరవాణి కూడా అనుసంధానించి ఉంటుంది. ఈ సూట్‌లో రెండు విధానాలు ఉంటాయి. అందులో మొదటిది సూట్ ధరించిన వ్యక్తి తనంతట తానుగా సూట్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ సూట్ ధరించిన వ్యక్తిపై వెనక నుంచి ఎవరైనా దాడి చేస్తే... సూట్‌కు అమర్చిన కెమెరాల ద్వారా సీనియర్ అధికారి చూసి...... అతడు కూడా సూట్‌ను ఆపరేట్ చెయ్యొచ్చు. మొబైల్ ఫోన్ నుంచే సూట్‌ను ఆపరేట్ చేసి కాల్పులు జరపవచ్చు. దీన్ని మరింత అభివృద్ధి చేస్తే సైనికులకు మరింత రక్షణగా ఉంటుంది. ఉగ్రవాదులు, తీవ్రవాదులతో పోరాడేందుకు సైనికులకు మరింత శక్తి చేకూరుతుంది. - శ్యామ్ చౌరాసియా, ఐరన్ సూట్ రూపకర్త
పాకిస్థాన్ సహా ఇతర దేశాలు ఇలాంటి సూట్‌లు రూపొందించే పనిలో ఉన్నందున... డీఆర్డీఓ వంటి ప్రభుత్వ సంస్థలు ఈ ఐరన్ సూట్‌ను పరిశీలించాలని శ్యామ్ కోరారు. సైనికుల రక్షణ కోసం దీనిని తాను రూపొందించానని... ఒక సైనికుడి ప్రాణం చాలా విలువైనదని ఆయన తెలిపారు.
- ఇదీ చూడండి: ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు .. మధురై మహిళల ఘనత