హరియాణా కైతల్ జిల్లాలోని జింద్ నగరంలో నివసించే ఓ వ్యక్తి పొట్ట నుంచి సజీవ పురుగులను వైద్యులు తొలగించారు. అందులో ఓ పురుగు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 6.3 అడుగుల పొడవు ఉంది. పురుగును చూసిన వైద్యులు షాక్ అయ్యారు.
రోగి చాలా రోజుల నుంచి జ్వరం, కడుపునొప్పితో బాధపడుతున్నాడని అతని బంధువులు తెలిపారు. చాలా చోట్ల చికిత్స చేయించుకున్నప్పటికీ నొప్పి తగ్గకపోవటం వల్ల నగరంలోని 'జైపుర్' ఆసుపత్రికి వచ్చినట్లు చెప్పారు. రోగిని పరీక్షించిన వైద్యులు అతనికి శస్త్ర చికిత్స చేసి సుమారు 6.3 అడుగుల పొడవైన పురుగును బయటకు తీసినట్లు వెల్లడించారు. ఈ ఘటనతో వైద్యులతో పాటు రోగి కూడా ఆశ్చర్యపడ్డాడు.
" ఒక వారం ముందు నాకు సమస్య మొదలైంది. ఏమి తినబుద్ది అయ్యేది కాదు. మూడు రోజులు తర్వాత కడుపులో నొప్పిగా అనిపించింది. వైద్యులు ఆపరేషన్ చేసిన తరువాత పురుగు బయటకువచ్చింది. ముందుగా చిన్నగానే కనిపించింది. తరువాత తీస్తూ ఉన్న కొద్ది వస్తూనే ఉంది. పురుగును మొత్తం తొలగించారు.''
-బాధితుడు
ఈ కీటకాల శాస్త్రీయ నామం 'టినియా సోలియం'గా తెలిపారు ఆసుపత్రి వైద్యులు. ఈ పురుగు పచ్చి మాంసం, కూరగాయలను కడగకుండా తినటం వల్ల తయారవుతుందని చెప్పారు. ఒక వ్యక్తి కడుపులో సుమారు 25 ఏళ్లు జీవించగలదని తెలిపారు. 25 ఏళ్ల తరువాత పురుగు వల్ల ఇబ్బందులు మొదలవుతాయన్నారు. అనంతరం మూర్ఛ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.