ఆడుతూ పాడుతూ ఎదగాల్సిన ఓ చిన్నారి తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోంది. తప్పిపోయిన సోదరుడిని వెతకడానికి అంగవైకల్యంతో బాధపడుతున్న తన తల్లిని చక్రాల కూర్చీలో తోసుకుంటూ కిలోమీటర్లు మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తోంది ఆ బాలిక. ఆ చిన్నారి ఎందుకు సోదరుడి కోసం అంతలా తపిస్తోంది? తనకు వచ్చిన కష్టమేమిటి?
అసలు ఏం జరిగింది?
ఏదో ఒక పని చేసుకొని పొట్ట నింపుకోవాలని లాక్డౌన్ ప్రకటించక ముందు చెన్నై నుంచి కర్ణాటక కొలార్ జిల్లాలోని బంగారపేట చేరుకుంది ఓ కుటుంబం. అమ్మకు పని చేస్తున్నప్పుడు కాళ్లు పోయాయి. ఆమెకు కొడుకు, కుమార్తె ఉన్నారు. ముగ్గురూ కలిసి ఏదైనా ఓ పని చేసుకొని బతుకుదాం అని అనుకున్నారు. ఈలోపే ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. దీంతో తినడానికి తిండి లేక తల్లడిల్లిపోయారు. కొడుకు చిన్నవాడైనా... తల్లి, సోదరి ఆకలి తీర్చడానికి చిన్న చిన్న పనులు చేసేవాడు. ఉపాధి దొరక్కపోతే యాచించి వారికి ఏదోలా ఆహారం తీసుకెళ్లేవాడు.
కష్టాలు ఆరంభం..
కానీ ఆకస్మాత్తుగా ఆ పిల్లవాడు తప్పిపోయాడు. అప్పటి నుంచి ఆ బాలిక ఫాతిమాకు కష్టాలు మొదలయ్యాయి. పట్టణంలో సోదరుడిని వెతకడం మొదలు పెట్టింది. అయినా ఎక్కడా కనిపించలేదు. ఇటీవల కొలార్‌లో ఉన్నట్లు తెలుసుకుంది. బంగారపేట నుంచి తన తల్లిని ఓ చక్రాల కుర్చీలో కూర్చోపెట్టి నెట్టుకుంటూ కొలరాకు తన సోదరుడిని వెతుకుతూ వెళ్లింది. అయినా సోదరుడి జాడ తెలియలేదు.
చిన్న వయసులోనే తల్లి, సోదరుడి కోసం ఆందోళన చెందుతుంది ఆ చిన్నారి. పట్టు వదలకుండా తన సోదరుడిని వెతుక్కుంటూ.. వీల్‌చైర్‌లోనే తన తల్లిని తీసుకుని తిరిగి చెన్నైకు వెళ్లాలని నిర్ణయించుకుంది ఆ బాలిక.
ఇదీ చూడండి: జీర్ణక్రియ సమస్య 'షికంజి'తో మాయం