కరోనా వైరస్ను నియంత్రించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్లను ప్రజలు అతిక్రమిస్తున్నారు. అత్యవసర, నిత్యావసర దుకాణాలకు ప్రజలు భారీ ఎత్తున వస్తున్నారు. ఎలాంటి స్వీయ భద్రత పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
దిల్లీలో...
దేశ రాజధాని దిల్లీలో లాక్డౌన్ నడుస్తోంది. ఈ ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 31 వరకూ అత్యవసరసేవలు మినహా అందరూ బంద్ పాటించాలని కేజ్రీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే అక్కడక్కడా ప్రజలు యథేచ్చగా బయటకు వస్తున్నారు.
పంజాబ్లో...
పంజాబ్ రాష్ట్రం అంతా లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రజలు ఉదయాన్నే పాలు, ఇతర అత్యవసర వస్తువులు కొనుగోలు చేసేందుకు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. దుకాణాలు మూసే ఉన్నాయి.
ఉత్తర్ప్రదేశ్లో...
ఉత్తర్ప్రదేశ్ 16 జిల్లాల్లో లాక్డౌన్ విధించింది యోగి ఆదిత్యనాథ్ సర్కార్. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు ఆంక్షలు కొనసాగుతాయని సర్కార్ ప్రకటించింది.
అయితే రాష్ట్రంలోని పలుచోట్ల కూరగాయలు, కిరాణా దూకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. నిత్యావసరాల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి.
మహారాష్ట్రలో...
మహారాష్ట్రలోని అహ్మదాబాద్, ఔరంగాబాద్, ముంబయి, ముంబయి సబర్బన్, నాగపుర్, పుణె, రత్నగిరి, రాయగఢ్, ఠాణె, యావత్మాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా అన్ని బంద్ పాటిస్తున్నాయి.
తమిళనాడు...
తమిళనాడులోని చెన్నై, ఎరోడ్, కాంచీపురంలో లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ నెలాఖరు వరకూ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువుల దుకాణాలకు మినహాయింపు ఇచ్చారు. అవి మాత్రమే తెరిచి ఉంచారు. మిగతా దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.