కరోనా బారిన పడ్డ వ్యక్తి.. లాక్డౌన్, భౌతిక దూరం వంటి ముందస్తు నివారణ చర్యలు పాటించకపోతే అతడు నెలరోజుల్లో మరో 406 మందికి వైరస్ను వ్యాపింపచేయగలడని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) అధ్యయనంలో తేలింది. అదే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తి తగ్గే అవకాశం ఉన్నట్లు వారి పరిశీలనలో స్పష్టమైంది. ఇలా చేయడం ద్వారా ఈ 30 రోజుల వ్యవధిలో ఇన్ఫెక్షన్ బారిన పడే వారి సంఖ్యను సగటున రెండున్నరకు తగ్గించవచ్చని తెలిపారు ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్.
ప్రస్తుతం దేశంలో వైరస్ పునరుత్పత్తి సంక్రమణ సంఖ్య(ఆర్ఓ) 1.5 నుంచి 4గా ఉన్నట్లు వెల్లడించారు అగర్వాల్.
''ఒకవేళ ఆర్ఓ 2.5గా ఉంటే.. కరోనా సోకిన ఓ వ్యక్తి నెల రోజుల్లో 406 మందికి వ్యాపింపచేయగలడు. అదే సమయంలో.. లాక్డౌన్, భౌతిక దూరం నిబంధనలు కట్టుదిట్టంగా పాటిస్తే దానిని సుమారు 75 శాతం తగ్గించవచ్చు. అంటే ఒక బాధితుడు.. మరో 2.5 మందికే వ్యాపింపజేసే అవకాశాలుంటాయి.''
- లవ్ అగర్వాల్, కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి
'ఆర్ఓ' అనేది కరోనా వ్యాప్తిని తెలియజేసేందుకు ఉపయోగించే గణిత సంకేతం.