జమ్ముకశ్మీర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూలోని తలాబ్ తిల్లీ ప్రాంతంలోని మూడంతస్తుల భవనంలో ఉదయం 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఇద్దరు సిబ్బంది, ఓ పౌరుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. వారిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బందికి చెందిన మరొక వ్యక్తి శిథిలాల కిందే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అతడిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అగ్నిమాపక బృందాలు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
భవనంలో ఉన్న టింబర్ మిల్లులో అధిక కలప నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో సిలిండర్ కూడా పేలడం వల్ల భారీగా మంటలు చెలరేగి భవనం కూలిపోయినట్లు వెల్లడించారు.