సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభనను శాంతియుతంగా చర్చల ద్వారానే పరిష్కరించుకునేందుకు భారత్- చైనాలు నిర్ణయం తీసుకున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం స్పష్టం చేసింది. దౌత్యమార్గాల్లోనే సమస్యను పరిష్కరించుకుంటామని వెల్లడించింది. తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితి సద్దుమణిగేవరకు సైనిక, దౌత్య పరమైన చర్చలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొంది.
ఇదీ చదవండి: భారత్, చైనా సైనికుల ఘర్షణ- ముగ్గురు జవాన్ల మృతి
మే 5న ఇరుదేశాల సైనికుల మధ్య పాంగోంగ్ సో సరస్సు వద్ద జరిగిన ఘర్షణతో సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. భారత్, చైనా సరిహద్దులో 1962 నుంచే ఇలాంటి పరిస్థితులు ఎన్నోసార్లు ఏర్పడ్డాయి. అన్నిసార్లు హింసాత్మకంగా తలపడకపోయినా.. రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది.
తొలిసారి
సరిహద్దు వెంబడి చైనా సైన్యం దాడి చేస్తుందని భారత్ ఎప్పుడూ అనుమానించలేదు. కానీ 1962 అక్టోబర్ 20న చైనా భారత్‌పై కాల్పులు జరిపింది. చైనా దాడిని ఊహించని భారత్... యుద్ధానికి సన్నద్ధం కాలేకపోయింది. ఫలితంగా 10-20 వేలమంది సైన్యం మాత్రమే ఉన్న భారత్ 80 వేల మంది చైనా సైనికులతో తలపడింది. నెలపాటు సాగిన ఈ యుద్ధం.. నవంబర్ 21న చైనా కాల్పుల విరమణ ప్రకటనతో ఆగిపోయింది.
ఐదేళ్ల తర్వాత
ఐదేళ్ల అనంతరం 1962న జరిగిన యుద్ధానికి భారత్ బదులు తీర్చుకుంది. 1967లో అప్పటి సిక్కిం రాజ్యంలో చైనా సైన్యం ప్రవేశించి భారత జవాన్లను కవ్వించింది. ఈ ఘర్షణల్లో 80 మంది భారత జవాన్లు అమరులు కాగా.. 300 నుంచి 400 మంది చైనా సైనికులు మృత్యువాతపడ్డారు.
చైనా కొత్త వ్యూహం
1967 నుంచి భూవివాదాలనే ప్రధాన వ్యూహంగా మలచుకుంది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. తమ అధీనంలో ఉన్న ఇతర దేశాల భూభాగంలోకి శత్రువులను రాకుండా చేయడం సహా.. శత్రుదేశాల భూభాగాలనూ తమదే అని వాదించడం ప్రారంభించింది.
ఇదీ చదవండి: మోదీతో రాజ్‌నాథ్ భేటీ.. సరిహద్దు ఘర్షణపై వివరణ
ఇలాంటి ఘటనే 1987లో అరుణాచల్ ప్రదేశ్‌లోని సుమ్దోరంగ్ ఛులో జరిగింది. ఇరుదేశాల మధ్య మొదలైన ప్రతిష్టంభన దాదాపు యుద్ధం అంచుల వరకు వెళ్లింది. అయితే అప్పటి భారత ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించింది. అప్రమత్తత, దూకుడును కలగలిపిన దౌత్య నీతితో యుద్ధాన్ని నివారించి చైనాను చర్చల వరకు తీసుకొచ్చింది. మరుసటి ఏడాదే భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చైనాలో పర్యటించి.. ఆ దేశ ప్రీమియర్‌తో సమాలోచనలు జరిపారు.
2013లో ఆక్రమణ!
2013 ఏప్రిల్‌లో చైనా సైన్యం తమ భూభాగంలో ఆర్మీ స్థావరాలు ఏర్పాటు చేసిందని భారత్ తెలిపింది. వాస్తవాధీన రేఖను దాటుకొని 10 కి.మీ మేర లోపలికి చొచ్చుకొచ్చినట్లు పేర్కొంది. చివరకు 19 కి.మీ పరిధిలోని భారత్ భూభాగాన్ని ఆక్రమించిందని ప్రభుత్వం లెక్క తేల్చింది.
అదే సమయంలో సైన్యానికి సామగ్రి అందించడానికి భారత గగనతలంలోకి చైనా హెలికాఫ్టర్లు ప్రవేశించినట్లు భారత్‌లోని మీడియా ఆరోపించింది. అయితే వీటిని చైనా అధికారులు ఖండించారు. మే నెలలో రెండు దేశాలు తమ బలగాలను ఉపసంహరించుకోవడం వల్ల సరిహద్దులో ఉద్రిక్తతలకు తెరపడింది.
సైన్యం అండతో నిరసన
2014 సెప్టెంబర్‌లో మరోసారి చైనా భారత్ సైన్యం మధ్య ప్రతిష్టంభన మొదలైంది. ధెమ్చొక్ గ్రామంలో భారత కార్మికులు ఓ కాలువ నిర్మిస్తున్న సమయంలో సైన్యం అండతో చైనా ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో చైనా మిలిటరీ తమ భూభాగంలోకి 3 కి.మీ మేర చొరబడి శిబిరాన్ని ఏర్పాటు చేసుకుందని భారత్ ఆరోపించింది. దాదాపు మూడు వారాలు కొనసాగిన ఈ ఘర్షణ వాతావరణం.. బలగాల ఉపసంహరణతో సద్దుమణిగింది.
2015లో
2015 సెప్టెంబర్‌లో ఉత్తర లద్దాఖ్‌లోని బర్ట్సే ప్రాంతంలో చైనా, భారత్ బలగాలు పరస్పరం తలపడ్డాయి. సరిహద్దు వెంబడి చైనా నిర్మించిన వాచ్-టవర్‌ను భారత బలగాలు ధ్వంసం చేయడం వల్ల ఈ ఘర్షణ తలెత్తింది.
డోక్లాం ప్రతిష్టంభన
2017 జూన్ 16న డోక్లాం ప్రాంతంలోకి చైనా భారీ యంత్రాలను తీసుకొచ్చి రహదారుల నిర్మాణం ప్రారంభించడం వివాదానికి దారితీసింది. అంతకుముందు భారత సైన్యం కాపలా కాసే 'డోకా లా పాస్' ప్రాంతం వరకు చైనా మట్టి రోడ్డు నిర్మించింది.
భారత్, భూటాన్‌లు సమస్యాత్మక ప్రాంతంగా పరిగణించే 'డోకా లా'లో ఈ నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రతిష్టంభన మొదలైంది. జూన్ 18న చైనా రహదారి నిర్మాణంలో భారత ఆర్మీ జోక్యం చేసుకుంది. దీంతో డోక్లాం సైనిక వివాదం ప్రారంభమైంది.
తాజా ఘర్షణకు కారణం!
డోక్లాం వివాదం తర్వాత 2020లో ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణలు మొదలయ్యాయి. మే 5న జరిగిన ఘటనలో సైనికులు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. అయితే ఈ ఘర్షణల వెనక పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని పరిశీలిస్తే చైనా దూకుడుకు గల ఆంతర్యం అర్థమవుతుంది.
- చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని షీ జిన్‌పింగ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది పూర్తయితే చైనా తన వస్తువులను గ్వాదర్ పోర్టుకు చేర్చి అక్కడి నుంచి ఆఫ్రికాకు ఎగుమతిచేయగలుగుతుంది.
- పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్-బాల్టిస్థాన్ మీదుగా నిర్మించే ఈ కారిడార్ పట్ల భారత్ మొదటి నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చైనా ఎప్పటికప్పుడు చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో గిల్గిత్-బాల్టిస్థాన్ తమ దేశంలో అంతర్భాగమని భారత్ మంగళవారం మరోసారి స్పష్టం చేసింది.
- భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) జమ్ము కశ్మీర్ సబ్ డివిజన్‌ను జమ్ము కశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్-బాల్టిస్థాన్, ముజఫరబాద్లుగా పరిగణిస్తున్నట్లు ప్రకటించింది. వాయువ్య భారత దేశానికి సంబంధించి వెలువరించిన వాతావరణ అంచనాల్లో గిల్గిత్-బాల్టిస్థాన్‌ల వివరాలనూ వెల్లడించింది.
- చైనా ఉత్పత్తి చేస్తున్న వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పడిపోయింది. దీని వల్ల చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. సరిహద్దులో ఉద్రిక్తతలు రాజేయడం ద్వారా దేశంలోని పేదరికం, నిరుద్యోగం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చాలని చైనా భావిస్తోంది.
- సరిహద్దులో భారత్ చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వ్యతిరేకంగానే చైనా ఈ విధంగా స్పందించినట్లు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కొవిడ్ మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ నష్టపోయి, దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో బలనిరూపణ కోసం చైనా ఈ చర్యలకు పాల్పడి ఉండొచ్చన్నారు.
ఆక్రమించేందుకే!
భారత సరిహద్దుతో పాటు, దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశం దూకుడుకు ఈ సంఘర్షణలు ప్రత్యక్ష సాక్ష్యాలని చైనాలోని భారత మాజీ దౌత్యవేత్త అశోక్ కాంతా పేర్కొన్నారు. పాంగోంగ్ సరస్సును పూర్తిగా ఆక్రమించాలని చైనా పన్నాగం పన్నుతోందని మరో దౌత్యవేత్త ఫున్చొక్ స్టోబ్దాన్ వెల్లడించారు. తద్వారా సరిహద్దులను మళ్లీ గుర్తించేలా భారత్‌పై చైనా ఒత్తిడి తీసుకురావచ్చని అన్నారు. సియాచిన్ హిమానీనదాన్ని సైతం చైనాలోనే అంతర్భాగంగా పరిగణించే అవకాశాన్నీ కొట్టిపారేయలేమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: భారత్-చైనా సరిహద్దులో ఎందుకీ ఉద్రిక్త పరిస్థితులు?