వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి భారత్-చైనా బలగాల మధ్య గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో భారత సైనికులు 76 మంది గాయపడినట్లు తెలుస్తోంది. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే వీరిలో ఎవరికీ తీవ్రగాయాలు కాలేదని, త్వరలోనే వారంతా విధుల్లో చేరనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. గాయపడిన వారిలో 18 మంది లేహ్‌లో చికిత్స పొందుతుండగా, వారికి 15 రోజుల్లోనే పోస్టింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం. స్వల్పంగా గాయపడిన మిగతా జవాన్లు వారంలో విధులకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
గల్వాన్ ఘటనలో కర్నల్ సంతోష్‌బాబుతో సహా మొత్తం 20 మంది జవాన్లు వీర మరణం పొందారు. పక్కా ప్రణాళికతోనే చైనా బలగాలు రాళ్లు, ఇనుప రాడ్లతో ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ ఘటనలో చైనా వైపు సైతం భారీ ప్రాణనష్టం జరిగినప్పటికీ ఆ దేశం వివరాలు వెల్లడించడం లేదు. దాదాపు 43 మంది చైనా సైనికులు మరణించి లేదా గాయపడి ఉంటారని భారత ఆర్మీ పేర్కొంటోంది. 35 మంది చైనా సైనికులు మరణించారని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
10 మంది విడుదల..?
భారత్, చైనాల మధ్య మూడు దఫాల చర్చల అనంతరం.. చైనా అధీనంలో ఉన్న పది మంది భారతీయ సైనికులు విడుదలయ్యారు. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. ఇద్దరు ఉన్నతాధికారులతో సహా మొత్తం పది మంది భద్రతా సిబ్బంది గురువారం సాయంత్రం భారత్‌కు చేరినట్లు తెలిసింది. అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, 1962 తరువాత భారతీయ సైనికులు చైనాకు చిక్కటం ఇదే తొలిసారని పరిశీలకులు అంటున్నారు.
ఇదీ చూడండి:'జల్ జీవన్ మిషన్' మోసాలపై అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖ