అసోంలో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అయింది. వానల బీభత్సంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదల ఉద్ధృతితో ప్రఖ్యాత కాజీరంగా జాతీయ పార్కు 70 శాతం నీట మునిగింది. ఫలితంగా వన్యప్రాణుల రక్షణార్థం ఎత్తయిన ప్రదేశాలకు తరలించారు అటవీ అధికారులు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అటవీ ఉద్యోగులందరికీ సెలవులను రద్దు చేసింది ప్రభుత్వం.
ప్రపంచంలో ఎక్కువ ఖడ్గమృగాలు కలిగిన పార్కు కాజీరంగానే. వాటితోపాటు పులులు, ఏనుగులూ భారీ సంఖ్యలోనే ఉన్నాయి. అడవి మధ్యలో నుంచి వెళ్లే జాతీయ రహదారి-37 పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వేటగాళ్లు ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రహదారిపై ప్రయాణించేవారికి హెచ్చరికలు జారీ చేశారు.
రాష్ట్రంలోని బలిపుర్ చార్, బాక్సా జిల్లాల్లో వరద ముంపు ఉన్న 150 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస ప్రాంతాలకు తరలించారు.