ప్రధాని నరేంద్రమోదీ త్వరలో అత్యంత ఖరీదైన విమానాల్లో ప్రయాణించనున్నారు. అమెరికా అధ్యక్షుడి తరహాలో మన దేశాధినేతకు భద్రతను కల్పించాలని ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 747 విమానాల్లోనే ప్రధాని ప్రయాణిస్తున్నారు. వీటిస్థానంలో అత్యాధునిక సాంకేతికత, ప్రత్యేక హంగులతో రూపొందిన రెండు బోయింగ్ 777 విమానాలను కొనుగోలు చేసింది ప్రభుత్వం.
ఈ విమానాలు త్వరలో ఫ్లోరిడాలోని బోయింగ్ ప్రధాన కార్యాలయం నుంచి భారత్కు రానున్నాయి. వీటిని వీవీఐపీ ప్రయాణ సౌలభ్యం కోసం లగ్జరీ హంగులు సమకూర్చారు. ఈ విమానాల ఖర్చు దాదాపు రూ.8,458 కోట్లు. ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్న ఈ విమానాల్లోని 7 ప్రత్యేకతలు మీకోసం..
1. కొత్తగా రానున్న విమానాలను ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రాథమిక ప్రయాణికులుగా ఉంటారు. వీరితోపాటు ఇతర ఉన్నతస్థాయి నేతలకూ ఈ శ్రేణి విమానాల్లో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది.
2. ఫ్లోరిడాలోని బోయింగ్ ప్రధాన కార్యాలయం నుంచి రానున్న ఈ విమానాలు ఈ ఏడాది జులై నుంచి పూర్తిస్థాయి విధుల్లో చేరుతాయి.
3. ప్రస్తుతం మోదీ, కోవింద్ ప్రయాణించే బోయింగ్ 747 విమానాలకు ఎయిర్ఇండియా ఉద్యోగులే పైలట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ బోయింగ్ 777ను మాత్రం భారత వాయుసేన పైలట్లు నడుపుతారు. ఇందుకోసం 5 ఐఏఎఫ్ పైలట్లకు ఇప్పటికే శిక్షణ ప్రారంభమయింది.
4. బోయింగ్-777లో లగ్జరీ ఫర్నీచర్తోపాటు భద్రత ప్రధానంగా రూపొందించారు. ఇందులో ప్రత్యేకమైన క్షిపణి నిరోధక వ్యవస్థను నిక్షిప్తం చేశారు. ఇందులో అమెరికా రక్షణ సహకార ఏజెన్సీ (డీఎస్సీఏ) రూపొందించిన లార్జ్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్మీజర్స్ (ఎల్ఏఐఆర్సీఎం), స్వీయ రక్షణ సూట్లు(ఎస్పీఎస్) ఉంటాయి.
వీటికి క్షిపణి హెచ్చరిక సెన్సార్లు(డబ్ల్యూఎంఎస్), కంట్రోల్ ఇంటర్ఫేస్ యూనిట్(సీఐయూ) అదనం. వీటి సాయంతో ఇన్ఫ్రారెడ్ క్షిపణులను పసిగట్టి.. నియంత్రించొచ్చు. వీటన్నింటికి సంబంధించిన శిక్షణను పైలట్లకు ఇస్తారు.
5. పై అంశాలతో కూడిన రెండు రక్షణ వ్యవస్థలను భారత్కు రూ.1,357 కోట్లకు అమ్మేందుకు 2019 ఫిబ్రవరిలో అమెరికా అంగీకరించింది.
6. ఈ విశిష్టమైన భద్రతా అంశాలతో పాటు ప్రత్యేక శైలిలో సమావేశ గది, వీఐపీ సూట్లు, వైఫై సౌకర్యం ఉంటాయి. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో రోగి రవాణా వ్యవస్థ కూడా ఇందులో ఉంది.
బోయింగ్ 777 విమానాలు ప్రజా రవాణా కోసం నిర్మించారు. అయితే భారత్కు విక్రయించే ఈ రెండు విమానాలను మాత్రం పూర్తిగా వీవీఐపీ శ్రేణిలో రూపొందించారు. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ఫోర్స్ వన్ స్ఫూర్తితో అన్ని రకాల హంగులను కల్పించారు.
7. చివరగా ఖర్చు..
- ఒక్కో విమానం ఖరీదు రూ.2,600 కోట్లు
- రక్షణ వ్యవస్థ రూ.1,350 కోట్లు
- అదనపు ఇంజిన్లకు రూ.782 కోట్లు
- కేబిన్ ఓవర్హాల్కు రూ.942 కోట్లు
- మొత్తంగా 2 విమానాలకు రూ.8,458 కోట్లు