ఒకవైపు దేశంలో కరోనా పంజా విసురుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉంది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇలాంటి పరిస్థతుల మధ్య తన భార్య ప్రసవం నాటికి ఇంటికి చేరుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. దృఢ సంకల్పంతో దిల్లీకి 600 కిలోమీటర్ల దూరమున్న స్వగ్రామానికి అనుకున్న సమయానికి చేరుకున్నాడు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ముకేశ్ మౌర్య. అయితే ఇది ఎలా సాధ్యమైంది?
ఇదీ జరిగింది...
ఉత్తర్‌ప్రదేశ్ అమేఠి జిల్లా ముసాఫిర్ఖానాకు చెందిన ముకేశ్ మౌర్య.. కుటుంబ పోషణ కోసం దిల్లీలోని రాజౌరి గార్డెన్లో రోజువారీ కూలీగా పని చేసేవాడు. అయితే మాయదారి కరోనా కారణంగా దేశంలో పరిస్థితులు మారిపోయాయి. లాక్డౌన్ ప్రకటించారు. పనిలేదు. భార్య నిండు గర్భిణి. ఆమె ప్రసవం నాటికి ఇంటికి చేరుకోవాలనే సంకల్పంతో అక్కడ నుంచి నడక మొదలు పెట్టాడు ముకేశ్. 'మనసుంటే మార్గం ఉంటుంది' అనే స్ఫూర్తితో చివరకు ఇంటికి చేరుకున్నాడు.
అష్టకష్టాలు పడి..
తన సొంత గ్రామమైన ముసాఫిర్ఖానా చేరుకోవడానికి ముకేశ్ అష్టకష్టాలు పడ్డాడు. రైళ్లు తిరగడం లేదు. రవాణా సేవలు పూర్తిగా నిలిపివేశారు. ఈ క్రమంలో మిగిలిన వలసదారులతో నడక ప్రారంభించి తిండి లేకుండా ప్రయాణం చేశాడు. చాలా గంటలు నడిచాడు. అయితే ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రపౌరుల కోసం దిల్లీ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు బస్సు సర్వీసులు నడిపింది. వైరస్ వ్యాప్తి భయాల నడుమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులో 20 గంటలు పాటు ప్రయాణం చేసి ఇంటికి చేరుకున్నాడు.
తక్షణమే..
'నేను ఇంటికి చేరుకునే సమయానికి నా భార్య పురుటినొప్పులతో బాధ పడుతుంది. బంధువుల సాయంతో తక్షణమే అంబులెన్స్ ఏర్పాటు చేసి ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఆమె పండంటి మగబిడ్డకు జన్మ నిచ్చింది. తండ్రి అయినందుకు గర్వంగా ఉంది. ఆ కష్టతరమైన ప్రయాణం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది' అని అన్నాడు ముకేశ్.
ఇదీ చూడండి: పందిట్లో ఉండాల్సిన వరుడు కరోనా విధుల్లో నిమగ్నమైతే...