దిల్లీలోని ఇంద్రపురిలో దుండగులు కలకలం సృష్టించారు. అక్కడి ఓ వ్యాయామశాలపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఇతడిని ఆసుపత్రికి తరలించారు.
" మా వ్యాయామశాలపై దుండగులు కాల్పులు జరిపారు. పైనుంచి చూసిన బాలుడిని కాల్చారు. బయట నుంచి జిమ్‌లోకి వస్తున్న మా తమ్ముడిపైనా కాల్పులకు పాల్పడ్డారు. తలకు గాయమవటంతో ఆసుపత్రికి తీసుకెళ్లాం."
- వ్యాయామశాల యజమాని, ఇంద్రపురి
ఇంద్రపురిలోని జేజే కాలనికి చెందిన నలుగురు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వ్యాయామశాల పై అంతస్తులో ఉండే బాలుడు కిటికీ నుంచి చూసే క్రమంలో కాల్పులు జరిపారని తెలిపారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.