దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్(ఎయిమ్స్)లో పని చేసే సుమారు 5వేల మంది నర్సులు నిరవధిక సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను నెరవేర్చడంలో యాజమాన్యం విఫలమైందని ఆరోపించారు. కేంద్ర ఆరోవ వేతన సంఘం సూచనలను తక్షణమే అమలు చేయాలని కోరారు. ఒప్పంద నియామకాలకు వ్యతిరేకంగా సమ్మెకు దిగినట్లు తెలిపారు.
"ఆరు నెలలుగా మా డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాం. కానీ వారు మా డిమాండ్లను తిరస్కరించారు. గతేడాది జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి హర్షవర్థన్ సూచన ప్రాయంగా అంగీకారం తెలిపారు. కానీ ఫలితం కనిపించడం లేదు. ప్రభుత్వ తీరు చాలా బాధాకరం. అందుకే సమ్మెకు దిగుతున్నాం."
-హరీశ్ కజ్లా, ఎయిమ్స్ నర్సుల యూనియన్ అధ్యక్షులు
ఇదిలా ఉంటే మెడికల్ సిబ్బంది వెంటనే సమ్మెను విరమించుకొని తిరిగి విధుల్లోకి రావాలని విజ్ఞప్తి చేశారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా. చేసే వృత్తిపట్ల నిబద్ధత ఉన్న వారు రోగులను వదిలి పెట్టి సమ్మెకు దిగరని అన్నారు.