దక్షిణ భారతదేశంలో భారీ స్థాయిలో రవాణా కారిడార్లను నిర్మించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. తూర్పు, పశ్చిమ భారతదేశంలోని పారిశ్రామిక ప్రాంతాలతో దక్షిణ భారతదేశాన్ని అనుసంధానించాలని భావిస్తోంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ఓడరేవుల ద్వారా ఈ కనెక్టివిటీ ఏర్పరచేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఇందుకు సంబంధించి 4 వేల కిలోమీటర్ల ప్రత్యేక సరకు రవాణా కారిడార్(డీఎఫ్సీ)ను నిర్మించనున్నట్లు ప్రభుత్వ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. రైల్వే చేపట్టే అతిపెద్ద మౌలిక వసతుల కార్యక్రమాల్లో ఈ డీఎఫ్సీ సైతం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా నిర్మించే కారిడార్ల వివరాలు
- తూర్పు తీర కారిడార్(1,115 కి.మీ): ఖరగ్‌పుర్(బంగాల్) నుంచి విజయవాడ(ఏపీ) వరకు.
- తూర్పు పశ్చిమ కారిడార్(1,673 కి.మీ): భుసావల్-నాగ్‌పుర్(మహారాష్ట్ర) నుంచి ఖరగ్‌పుర్-డన్కునీ(బంగాల్) వరకు, రాజ్ఖర్స్వాన్(ఝార్ఖండ్)-కాలీ పహాడీ(రాజస్థాన్)- అండాల్(బంగాల్) మధ్య 195 కి.మీ మార్గం.
- ఉత్తర దక్షిణ ఉప కారిడార్(975 కి.మీ): విజయవాడ-నాగ్‌పుర్-ఇటార్సీ(మధ్యప్రదేశ్) మార్గంలో మూడోది.
ఈ కారిడార్ల నిర్మాణం కోసం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీఎఫ్‌సీసీఐఎల్) త్వరలో సర్వే చేపట్టనుంది. ఏడాది వ్యవధిలో సర్వేను పూర్తి చేయనుంది.
అనుసంధానంతో రవాణా వేగం
ఈ కారిడార్ల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టుల మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుంది. మరోవైపు ఒడిశాలో పారాదీప్, ధమ్రా, గోపాల్‌పుర్ ఓడరేవుల మధ్య అనుసంధానం ఏర్పరుస్తుంది. ఫలితంగా వస్తు రవాణాలో వేగం పుంజుకుంటుంది. దీంతో రైల్వే వ్యవస్థ సామర్థ్యం మెరుగవుతుంది.
ఇవి కాకుండా ఇప్పటికే రెండు రవాణా కారిడార్ల నిర్మాణాన్ని ప్రారంభించింది డీఎఫ్‌సీసీఐఎల్. లూధియానా నుంచి డన్కునీ(1,856 కి.మీ) వరకు తూర్పు కారిడార్, దాద్రి(యూపీ) నుంచి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్(మహారాష్ట్ర-1,504 కి.మీ) వరకు పశ్చిమ కారిడార్ పనులు మొదలుపెట్టింది. రూ. 81 వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులు 2021నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: కరోనా కష్టాలు: వర్షంలో సైకిల్‌పై అంతిమయాత్ర!