కరోనాపై విజయం సాధించిన వారిలో వైరస్‌కు సంబంధించిన ప్రత్యేక యాంటీబాడీలు, టీ కణాలు ఉంటాయనేది వైద్యుల మాట. అయితే తాజాగా ఓ నివేదిక కీలక విషయాన్ని వెల్లడించింది. కరోనా బారిన పడి కోలుకున్న దాదాపు 40 శాతం మందిలో ఆ యాంటీబాడీలు(ప్రతినిరోధకాలు) మాయమైనట్లు తెలిపింది.
అహ్మదాబాద్ నగర పాలక సంస్థ 1800 మందిపై నిర్వహించిన సర్వేలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. యాంటీబాడీలు కోల్పోవడం వల్లే కరోనా నుంచి కోలుకున్న వారు మళ్లీ మహమ్మారి బారిన పడే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.
"కరోనా బారిన పడిన 1800 మందిని ఈ సర్వేలో భాగం చేశాం. మార్చి నుంచి జులై మధ్య యాంటీజెన్ పరీక్షల ద్వారా కరోనా నిర్ధరణ అయిన వారిని పరిశీలించాం".
-- డాక్టర్ జై షేత్, ఎంఈటీ మెడికల్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్
"ఈ సర్వే ద్వారా తెలిసిందే ఏంటంటే.. వైరస్ నుంచి కోలుకున్న వారిలో దాదాపు 40 శాతం మందిలో యాంటీబాడీలు కనిపించలేదు. వ్యాధి బారి నుంచి బయటపడిన కొన్ని రోజులకు క్రమంగా అవి కనుమరుగవుతున్నాయి. దీని ఆధారంగా చూస్తే యాంటీబాడీలు కోల్పోయిన వ్యక్తులు మళ్లీ కొవిడ్-19 బారిన పడే అవకాశం ఉందని తెలుస్తోంది. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మాస్కులు ధరించాలి. భౌతిక దూరం నిబంధనలు కచ్చితంగా పాటించాలి."
--డాక్టర్ భవిన్ సోలంకి, అహ్మదాబాద్ నగర పాలక సంస్థ వైద్యాధికారి.
కరోనా నుంచి కోలుకున్న వారికి మళ్లీ వైరస్ సోకే అవకాశాలపైనా లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు వైద్యులు.
" కరోనా వైరస్ అనేది ఓ కొత్త సబ్జెక్ట్. ఆ వైరస్ ప్రవర్తనా, స్వభావంపై పూర్తి స్థాయి విషయాలు తెలియవు. ఎందుకు కోలుకున్న వ్యక్తుల్లో యాంటీబాడీలు మాయమవుతున్నాయి అనేదానిపై మరింత పరిశోధన అవసరం."
-- డాక్టర్ పటేల్, యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్
విదేశాల్లో ఇటీవల కరోనా రీఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ నగర పాలక సంస్థ నిర్వహించిన సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది.