ఇటీవల 37మంది కేంద్రమంత్రులు జమ్ముకశ్మీర్‌లో పర్యటించారు. ఈ నేపథ్యంలో అక్కడ వివిధ అభివృద్ధి పథకాల అమలు తీరుపై ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంఓ) వీరంతా తమ అభిప్రాయాల్ని సమర్పించనున్నట్లు సమాచారం.
సంక్షేమ పథకాల అమలుపై ఇప్పటికే 14 మంది మంత్రులు తమ నివేదికను సమర్పించారు. ఈ అభిప్రాయ సేకరణ ద్వారా జమ్ముకశ్మీర్‌లో తగిన చర్యలు తీసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
ప్రధాని ఆదేశాల మేరకు..
కొత్తగా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటైన జమ్ముకశ్మీర్‌లో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలపై నిజాయతీగా నివేదిక సమర్పించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు.. 37మంది మంత్రులు కశ్మీరులోయలో పర్యటించారు. వీరిలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు, హోంశాఖ సహాయ మంత్రులు జి. కిషన్ రెడ్డి, నిత్యానంద్ రాయ్ తదితరులు ఉన్నారు. ఈ పర్యటనలో రోడ్లు, ఆరోగ్య సంరక్షణ, విద్యుత్ సౌకర్యం, విద్యాసంస్థల పనితీరుతో పాటు ఇతర విషయాలపై ప్రజలతో సంభాషించి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ప్రత్యేక ప్రతిపత్తి నేపథ్యంలో..
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని గతేడాది ఆగస్టులో రద్దు చేసిన అనంతరం రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది కేంద్ర ప్రభుత్వం. అప్పటి నుంచి ఆ ప్రాంతంలోని పరిస్థితి, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును నిశితంగా పరిశీలిస్తోంది.