కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను సమర్థిస్తూ సోమవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు 32 మంది మాజీ ఐఏఎస్ అధికారులు. దార్శనికతో తీసుకొచ్చిన ఈ చట్టాలు రైతులను దళారీ దోపిడీ విధానాల నుంచి రక్షించి వారి జీవితాలను సమూలంగా మారుస్తాయని పేర్కొన్నారు. ఈ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా కనీస మద్దుత ధర కొనసాగుతుందని, రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా, ఎవరికైనా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎంత ధరకైనా విక్రయించుకునేందుకు వీలుంటుందని తెలిపారు. ఇప్పటివరకు నిత్యావసర వస్తువుల చట్టంలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలపై ఉన్న పరిమితులు తొలగిపోతాయని, దీనివల్ల మరింత గిరాకీ వస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇప్పటివరకూ మైనార్టీలు, విద్యార్థుల్లో అసత్యాలు ప్రచారం చేస్తూ వచ్చిన కొన్ని వర్గాలు ఇప్పుడు రైతులను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న కుటిల ప్రయత్నాలను ఖండిస్తున్నట్లు మాజీ ఐఏఎస్లు సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశారు.