ఎన్నికల ప్రచారం అంటేనే మాటల తూటాలు, విమర్శలు, ప్రతి విమర్శలు. బిహార్ శాసనసభ ఎన్నికల ప్రచార పర్వంలోనూ ఇవే సన్నివేశాలు. పార్టీల ప్రచారంలో అనేక అంశాలతో పార్టీలు ముందుకు వెళ్తుండగా.....శాంతిభద్రతల అంశాన్ని కూడా రాజకీయ పార్టీలు ఓ అస్త్రంగా ఎంచుకున్నాయి. ఇదే సమయంలో అభ్యర్ధుల చరిత్రకు సంబంధించి ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) పలు విషయాలు బయటపెట్టింది.
31 శాతం మందిపై నేరారోపణలు..
బిహార్ శాసనసభకు అక్టోబర్ 28న తొలి విడత ఎన్నికలు జరగనుండగా...... అన్ని పార్టీల నుంచి కలిపి ఒక వెయ్యి 64 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. అయితే ఇందులో 31శాతం అంటే ఏకంగా 328 మందిపై నేరారోపణలు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది. వీరిలో అయిదేళ్ల జైలు శిక్ష పడి నాన్ బెయిలబుల్ కేసులు వంటివి ఎదుర్కొంటున్న వారు ఏకంగా 244 మంది ఉన్నట్లు వెల్లడించింది. అత్యధికంగా ఆర్జేడీకి చెందిన 41 మంది అభ్యర్ధుల్లో ఏకంగా 73 మంది శాతం మందిపై కేసులు ఉన్నట్లు తెలిపింది. భాజపా అభ్యర్ధుల్లో 71 శాతం మంది, లోక్ జనశక్తి అభ్యర్ధుల్లో 59శాతం మంది, కాంగ్రెస్ అభ్యర్ధుల్లో 57శాతం మంది, జేడీయూ అభ్యర్ధుల్లో 43శాతం మంది, బీఎస్పీ అభ్యర్ధుల్లో 31శాతం మందిపై కేసులు ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. మొత్తం అభ్యర్ధుల్లో మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్న వారు 29 మంది ఉండగా, వీరిలో ముగ్గురిపై అత్యాచార కేసులు ఉన్నట్లు తెలిపింది. 21 మందిపై హత్యకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది.
375 మంది కోటీశ్వరులు...
అభ్యర్ధుల ఆర్థిక స్ధితిగతులపై కూడా వివరాలు వెల్లడించిన ఏడీఆర్. ఒక వెయ్యి 64 మందిలో 375 మంది కోటీశ్వరులు అని తెలిపింది. అత్యధికంగా ఆర్జేడీ అభ్యర్ధుల్లో 95 శాతం మంది కోటీశ్వరులు కాగా, జేడీయూ అభ్యర్ధుల్లో 89శాతం మంది, భాజపా అభ్యర్ధుల్లో 83శాతం మంది, ఎల్జేపీ అభ్యర్ధుల్లో 73శాతం మంది, కాంగ్రెస్ అభ్యర్ధుల్లో 67శాతం మంది, బీఎస్పీ అభ్యర్ధుల్లో 46శాతం మంది కోటి రూపాయల కంటే ఎక్కువ ఆస్తులను ప్రకటించినట్లు ఏడీఆర్ నివేదికలో పేర్కొంది. 1064 మంది అభ్యర్ధుల సగటు ఆస్తి ఒక కోటి 99లక్షల రూపాయలు అని వెల్లడించింది. నేరారోపణలు ఉన్న వారిని అభ్యర్ధులను ఎంపిక చేసుకోవడానికి గల కారణాలు, నేరారోపణలు లేని వారిని ఎందుకు ఎంపిక చేయడం లేదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించలేదని ఏడీఆర్ తెలిపింది.
ఇదీ చూడండి: బిహార్ బరి: వలస కార్మికులు నితీశ్‌కు జైకొట్టేనా?