మహారాష్ట్ర ముంబయి నగరంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. నిన్న స్తంభించిన రవాణా వ్యవస్థ నేడు సాధారణ స్థితికి చేరుకుంది. బస్సు, రైలు సర్వీసులను పునరుద్ధరించారు. బుధవారం అర్ధరాత్రి నుంచే రైళ్లను యథావిధిగా నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.
30 విమాన సర్వీసులు రద్దు
ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు 30 సర్వీసులను రద్దు చేశారు. 118 విమానాలు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు.
ముందస్తు సమాచారం లేకుండా విమాన సర్వీసులను రద్దు చేశారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు.
భారీ వర్షాల కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ముంబయిలోని పాఠశాలలు, కళాశాలలకు గురువారం కూడా సెలవు ప్రకటించారు.
ఇదీ చూడండి: 'హెల్మెట్ లేని ప్రయాణం- రాహుల్, గడ్కరీకి ఫైన్!'